13 November, 2012

దీపావళి ముచ్చట్లు - 2

దీపావళి ముచ్చట్లు - 2




నాకు అప్పుడు పద్నాలుగేళ్ళుంటాయి. ఆ దీపావళికి మా పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలయిపోయింది. మొత్తం మతాబాలు, చిచ్చుబుడ్లు తయారీ పని , నేను, మా పెద్దతమ్ముడు చి!సారధి తీసుకుని చేస్తున్నాము. వాడు "అన్నయ్యా! ఈసారి అవ్వాయి-సువ్వాయి" లు కూడా మనము తయారు చేద్దామా?"" అన్నాడు. "ఓరేయ్! నాన్నగారిచ్చిన డబ్బులు మనకి మతాబాలు, చిచ్చుబుడ్లకే సరిపోతాయి. అయినా అవ్వాయి-సువ్వాయి లు చేయడం మనకి రాదుకదా" అని వాడిని వెనక్కిలాగాను. కాని వాడు వినిపించుకోలేదు. ఎక్కడొ తిరిగి అవ్వాయి-సువ్వాయి లు ఎలా తయారు చెయ్యాలో అన్నీ తెలుసుకువచ్చాడు. అవ్వాయి-చువ్వయి గొట్టాలు తయారు చేయటం గమత్తుగా ఉంటుంది. మొత్తానికి వాడు ఆ గొట్టాలు తయారు చేస్తుంటే, నాకు కూడా ఉత్సాహం వచ్చి, "సరే! నేను మతాబాలలోని, సురేకారము కొంత ఇస్తాను. శ్యాంపిల్స్ బాగా వస్తే అప్పుడు చూద్దాం" అన్నాను. వాడు సాయంకాలం కల్లా పేకేజీ పెట్టెలు నాలుగు తెచ్చాడు. "ఇవెందుకురా?" అంటే, "ఇవి కాల్చి, బొగ్గుల పొడి తయారు చెయ్యాలి." అన్నాడు. రాత్రి దొడ్లో ఓ గొయ్యితీసి, కాగితాల మంట పెట్టి, ఆ నాలుగుపెట్టెలు ఆ గోతిలో వేసి తగలపెట్టాము.ఉదయాన్నే వెళ్ళి, ఆ బొగ్గులు, సంచీలో వేసి మెత్తగా

కొట్టీ పొడి చేశాము. అసలు పని ఆప్పుడే మొదలయ్యింది. "అన్నయ్యా! ఈ పొడికి అవ్వాయి-సువ్వాయి లు సరిగ్గా ఎగరవు. పొడి మెత్తగా ఉండాలి. మనం ఈ పొడి వస్త్రకాయితం పట్టాలి" ఆ పని రాత్రి మొదలుపెట్టాము. ఎవరికీ తెలియకూడదు. ఆ బొగ్గుపొడి వస్త్రకాయితం పట్తూంటే, పొడి బాగా మెత్తగా వచ్చిందికాని, ఇల్లు మా వళ్ళు నల్లగా తయారయ్యాయి. ముక్కుల్లోకి ఆ పొడి పోయి, ఇద్దరకీ ఎలర్జీ వచ్చి, చచ్చే తుమ్ములు వచ్చాయి. మా చిన్నతమ్ముడు మూర్తిని సహాయం అడిగాము. వాడు సహాయమము చేయక పోగా మేము అవ్వాయి-సువ్వాయి లు తయారుచేస్తున్నామని అమ్మతో చెప్పేశాడు. అమ్మ వచ్చి "ఒరేయ్! ఎందుకురా! ఈ పనులన్నీ. అడిగితే డబ్బులిచ్చేదాన్నికదా? మీరు ఈ పనులన్నీ ఎందుకు చెయ్యాలి. పైగా ఎమైనా ప్రమాదం అవుతుందేమో?" అని కంగారు పడింది. ఆవిడ కంగారు ఎందుకు పడుతోందో మాకు తెలుసు. అంతక్రితం ఏడాది కవులూరి వారింట్లో పెద్ద అగ్నిప్రమాదం జరిగి, ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. అదీ మా అమ్మగారి భయం. అమ్మకి చాలా నచ్చచెప్పాము. కవులూరు వారు " దీపావళి ఉల్లిపాయలు, అవీ పెద్దవి చేస్తున్నారు, అందుకని ప్రమాదం అయ్యింది" అని చెప్పి మా సారధి ఆవిడని ఒప్పించి, కాస్త ఆవిడ దగ్గరనుండి డబ్బులు కూడా మేనేజ్ చేశాడు. "బొగ్గు వస్త్రకాయితం" అయినతరువాత సురేకారము అలాగే చెయ్యాల్సివచ్చింది. మొత్తానికి ఐదురోజులు కష్టపడి, శ్యాంపిల్ "అవ్వాయి-సువ్వాయి" తయారయ్యింది. దాని పాళ్ళు సరిగ్గా సరిపోయాయి. అవి ముట్టించగానే, చేతులోంచే దూసుకుపోయేటట్లు తయారయ్యాయి. మా సంతోషానికి అంతేలేకుండా పోయింది. నెమ్మదిగా మొత్తం అవ్వాయి-సువ్వాయి ల మందు కలిపి వర్షం పడుతూంటే , వంటింటికి హాలుకి మధ్య మా పులిహొర పళ్ళెం లో దాదాపు రెండువందల అవ్వాయి-సువ్వాయిల మందు పెట్టుకుని వాటిని తయారుచేస్తున్నాము. ఒకటి కూడ తయారు కాలేదు. ఎక్కడినుంచి వచ్చాడో నా చిన్న తమ్ముడు మూర్తి " రేయ్ నాకో రెండు అవ్వాయి-సువ్వాయి లు ఇవ్వండిరా! నేను శ్యాంపిల్ చూస్తాను" అన్నాడు. సారధి తమ్ముడు " మాకు సహాయం చెయ్యమంటే, చేశావా? నీకు ఎందుకివ్వాలి. నీకు ఒక్కటి కూడా ఇవ్వము." అన్నాడు పులిహోర పళ్ళెము మీద చేతులుపెట్టి వంగిపోయి. " రేయ్! మర్యాదగా ఇస్తారా? లెదా?" అని వాడి బెదిరింపు.

"ఇవ్వముగాక, ఇవ్వము" అని వీడి మొండి సమాధానం. " నాకివ్వకపోతే, ఈ మందంతా తగలబెట్టేస్తా" అని వాడు ఎగశ్వాస పీలుస్తూ, చూపుడు వేలు చూపించాడు. "ఏదీ తగలబెట్టు! చూద్దాం"అని సారధి వాడిని రెట్టించాడు. అంతే! వాడు పరశురాముడిలా వంటింట్లో ఉన్న పొట్టు పొయ్యిలోనుండి, కాలుతున్న కట్టెపుల్ల తీసుకువచ్చాడు. నేను "రేయ్! మూర్తి ఆగరా! అన్నీ అయినతరువాత నీకు కూడా ఇస్తాము"

అన్నాను లేచి. తమ్ముడు సారధి కూడా లేచి వాడి చేయి పట్టుకుని వారించబొయాడు. వాడు ,వీడి చేయి ఒక్కసారి విదిలించుకుని, పులిహార పళ్ళెం వేపు కాలుతున్న కట్టెపుల్లతో ముందుకు వెళ్ళబోయాడు ఆ పెనుగులాటలో, ఓ నిప్పు కణం రెండువందల అవ్వాయి-సువ్వాయిల మందులొ పడింది. అంతే. మందు అంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. ఇల్లంతా పొగ చుట్టుకుంది. ముగ్గురము వంటింట్లోంచి బయటకు పరిగెత్తాము. మంట ఎలా భగ్గుమన్నదో అలాగే ఒక్క క్షణంలో ఆరిపోయింది. పక్కనే రెండు అడుగుల దూరంలోనే, మా పండగ బట్టలు, రోజు పడుకునే పరుపులు, పక్క బట్టలు అన్నీ ఉన్నాయి. ఆ క్షణం లో భగవంతుడు మమల్ని, మా ఇంటిని కాపాడాడు. రెండు నిమిషాల తరువాత లోపలకి వచ్చి చూస్తే, పులిహర పళ్ళెం (అల్యూమినియమ్) కరిగి షేప్ మారిపోయి ఉంది. మూర్తి తమ్ముడు సాయంకాలం గాని మాకు కనపడలేదు. వాడు నవ్వుతూ " ఊరికే భయపెడదామని అనుకుంటే ఏమిట్రా! అలా అయ్యింది." అన్నాడు. అంత పొగ మా ఇంట్లోంచి రావటం చూసి, కంగారుగా చుట్టుపక్కల వాళ్ళు జరిగింది తెలుసుకుని "ఆమ్మో ఎంత ప్రమాదము తప్పింది " అంటూంటే, "పిల్లలు ఆ మాత్రము అల్లరి చెయ్యరా ఏమిటీ" అంటూ మా అమ్మ మాకు దిష్టి తియ్యటము కొస మెరుపు.

చిరంజీవి సారధి బాంక్ నుండి రెటైర్ అయితే , చిరంజీవి మూర్తి ఇంటెలింజెస్ ఆఫిసర్ గా రెటైర్ అయ్యాడు. ఇద్దరు తాతయ్యలు కూడా

కానీ ఈ విషయము అమ్మ నాన్నగారికి తెలియకుండా ఎలా మానేజ్ చేసిందో మా ముగ్గురికి తెలియదు.

దీపావళి ముచ్చట్లు -1

దీపావళి ముచ్చట్లు -1




ప్రతి దీపావళీ అందరికీ కొత్తగానే వుంటుంది. ఎన్ని దీపావళీలు గడిచినా, దీపావళి వస్తోందంటే, అదొక కొత్త ఉత్సాహం.

చిన్నప్పుడు మా ఇంట్లో మగపిల్లలం ఆరు, ఆడపిల్లలు ఐదు కాబట్టి, దీపావళి అంతా మా ఇంట్లోనే జరిగేది. నెల రోజులబట్టీ, మతాబాల గొట్టాలు మా శ్రీ భాస్కరన్నయ్య తయారు చేస్తూ ఉండేవాడు. మొత్తం పదకొండు మంది. దీపావళి ముందు నుంచి అమ్మ కార్తీక సోమవారాలు, పౌర్ణమి దాక ఉండాలి కాబట్టి, మతాబా గొట్టాలు ఓ రెండు వందలు తయారు చేశేవాడు. అవ్వన్నీ తయారు చేయటానికి, శ్రీ వేదాద్రి చిన్నన్నయ్య, నేను, భాస్కరన్నయ్యకు సహాయం చేశేవాళ్ళం. మతాబా గొట్టాలకి పేపర్లు, చుట్టటానికి కావలసిన గుండ్రటి వెదురు పుల్లలు అన్నీ సిద్ధము చేసుకుని కార్య రంగంలోకి ఉరికేవాడు శ్రీ భాస్కరన్నయ్య.

ఆ మతాబా గొట్టాలు తయారుచేయటానికి కావలసిన మైదా పిండి మా దుర్గక్కయ్య, పొట్టుపొయ్యమీద తయారు చేసి ఇస్తూండేది. అప్పటికింకా మా ఇంట్లో గ్యాస్ పొయ్యిలు రాలేదు. ఇవి 1958-59 ప్రాంతములో మేము విజయవాడ గవర్నరు పేటలో ఉండేటప్పటి ముచ్చట్లు.

మేము మతాబా గొలు రెండువందలు తయారు చేసి, అవి పెద్ద ఈత ఆకు చాపల మీద పెట్టి ఎండలో పెట్తే, అవి వంకర పోతుంటే, మా అన్నయ్య వచ్చి, వాటిని కాస్త నీడలోకి చాపతో సహా లాగుతుండేవాడు. అవి అలా రెండురోజులు ఎండబెట్టి, వాటిని, తీసుకెళ్ళి పందిరిమంచం క్రిందకి ఎవరూ తొక్కకుండా ఉండేందుకు, తోసేసేవాడు. ఇంక పెద్దన్నయ్యతో, మతాబాలకి కావలసిన ముడి సరుకులు కొనుక్కుని రావడం ఓ సరదాగా ఉండేది. ఇనుపరజను, గంధకము, సురేకారము, పొడిసున్నము, ఆముదము, ఇవి కావలసినవి. అవి గవర్నరుపేట "చెట్లబజారులో" దొరికేవి. అక్కడ దాదాపు నాలుగు వీశెలు (పాత తులామానము, వీశె అంటే పద్నాలుగు వందల గ్రాంలు) కొనుక్కుని,తిరిగి వచ్చేటప్పుడు, అరండల్ సత్రము దగ్గర ఖాళీ మట్టి చిచ్చు బుడ్లు ఓ రెండు డజన్లు, ప్రమిదలు ఓ వంద అన్నయ్య కొనేవాడు. ఇవ్వన్నీ కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఓ రెండు గంటలు పట్టేది. అంటే పొద్దున్న ఎనిమిదికి వెళ్తే, ఇంటికివచ్చేసరికి, పదయ్యేది.

ఇఖ అన్నయ్య ఆ మందు సామన్లన్ని, మా ఇంట్లో చివర గదిలోకి చేర్చి, మేమవరము రాకుండా, ఆ రజను, గంధకము, నూరినసురేకారము, సున్నము, అన్నీ చెత్తాచెదారము లేకుండా తనొక్కడే శుభ్రము చేశేవాడు. మేము లోపలకి వెళ్ళకుండా, కిటికీలోనుండి, అన్నీ విచిత్రముగా చూశేవాళ్ళము. ఆ పని అయిన తరువాత అవ్వన్నీ ఎండబెట్టేవాడు. చిచ్చుబుడ్ల మూతులు (చిన్నకంతలకు) చిన్న కాగితాలతో, మూసేసేవాడు. అన్నీ ఓ రెండు మూడురోజులు ఎండబెట్టి, మాఇంట్లో పెద్ద పులిహార పళ్ళములో , ఓ రాత్రి పూట అన్నీ కలిపి మతాబాల మందు తయారు చేశేవాడు. మా అమ్మ చేత "శాంపిల్" మతాబా కాల్పించేవాడు. అది బాగా పువ్వులు పడుతూ ఆగకుండా కాలితే, అన్ని మతాబాలు తయారు చేసేవాడు. ఈ మతాబాలు కూరటంలో ఇంట్లో మగపిల్లలము అందరము సహాయము చేసేవారము. మతాబు గట్టిగా రావాలని అన్నయ్య మధ్య మధ్య హెచ్చరిస్తూ ఉండేవాడు. మతాబా చివర కాస్త "ఇసక" పోసి తయారు చెయ్యమని అమ్మ చెపుతూ ఉండెది. చిన్నపిల్లలు చేతులు కాల్చుకుంటారని అమ్మ హెచ్చరిస్తు ఉండేది. చిచ్చుబుడ్లు మాత్రము అన్నయ్యే అన్నీ చేస్తూండేవాడు. మొదట ప్రత్యేకముగా తను బజారు నుండి తెచ్చిన "జిల్లీ" అనే మందు పోసి, దానిమీద మతాబు మందు జాగ్రత్తగా ఎక్కువ వత్తిడి లేకుండా కూరి వెనకాల మళ్ళీ కాగితాలు అన్నీ కూరి, బంకమట్టితో మూసేశేవాడు. చిచ్చుబుడ్లుకూడా "శ్యాంపిల్స్" అంటూ అన్నయ్యే ముట్టించేవాడు. అది పగలే అయినా అది పువ్వులు పైకి విరజిమ్ముతూంటే, ఆనందంతో గంతులేసేవాళ్ళం. పైగా అది మా అన్నయ్య సొంత తయారీ కదా! అదీ గర్వం.

అన్నయ్యకి ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళటం వలన ఓ ఆరేడు సంవత్సరాల తరువాత ఈ పని అంతా నేనే చూశేవాడిని. అయితే ఇంత భారీగా ఉండేది కాదు. ఎందుకంటే, ఇద్దరు అక్కయ్యలు అత్తవారిళ్ళకు, వెళ్ళారు. ఓ అన్నయ్య ఉద్యోగం, ఇంకో అన్నయ్య పెద్ద చదువు, దీపావళీ ఖర్చు , ఇవ్వన్నీ కలిపి నా పని భారం తగ్గించేశాయి. ఐనా ఉత్సాహం తగ్గక, అలాగే చేస్తూండేవాళ్ళము, నేను, మాసారధి తమ్ముడు, మూర్తి తమ్ముడు. ఓ సారి మా ఇంట్లో దీపావళీ సీజనులో ఓ పెద్ద అగ్నిపమాదం జరిగింది. ఆ విశేషాలు చెప్పబోయేముందు, ఓ చిన్న డిన్నర్ బ్రేక్.

నందన దీపావళి శుభాకాంక్షలు



                              నందన దీపావళి  శుభాకాంక్షలు


             కీసర వంశస్తులందరికీ  నందన నామ సంవత్సర దీపావళి  శుభాకాంక్షలు




కీసర వంశస్తులందరికీ నందన నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు


 

కీసర వంశము***** KEESARAVAMSAM