26 March, 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013


నేను, నా ధర్మపత్ని చి.జగదీశ్వరి 18 వ మార్చిన బయలుదేరి మరునాడు ఉదయము కాశీ చేరుకున్నాము. బస జయపూరియ హోటల్. అసి, కేదార్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, లలో పుణ్యస్నానములు ఆచరించి, సరిగ్గా అపర్నాహము అగుసరికి మణికర్ణికా ఘాట్ లో రామేశ్వరము నుండి తెచ్చిన జలములతో సహా సైకతలింగమునకు అర్చన చేసుకొని, సైకతలింగము సమంత్రకముగా పవిత్ర గంగాజలములలో నిమజ్జనము గావించాము.

తదుపరి శ్రీకాశీవిశ్వనాధుని దర్శనము చేసుకుని శ్రీస్వామికి క్షీరాభిషేకముతో అర్చన చేసుకున్నాము.

కాశీఅన్నపూర్ణను సేవించుకుని, సాక్షిగణపతి స్వామికి కైమోడ్పులొనరించి., బస చేరుకుని సాయంకాలము గయ ప్రయాణము అయ్యాము.

ఫాల్గుణ శుద్ధనవమి - మా నాన్నగారి తిధి

గయ మేము బుధవారము ఫాల్గుణశుద్ధనవమి 20 వ మార్చి తెల్లవారుఝామున మూడుగంటలకు చేరుకున్నాము. ముందు అనుకున్నప్రకారము స్థానిక తెలుగు పురోహితులు శ్రీఅరుణాచారి గారు తమ మనిషిని రైల్వేస్టేషన్ కి పంపారు. అతని సహాయముతో మేము బసకు చేరుకుని రెండుగంటలు విశ్రాంతి తీసుకుని, తరువాత సంధ్యాదులు ముగించి, అపర్ణాహ వేళకు మాకు నిర్ణయించబడిన గదిలో ఆరోజు కీ.శే.మానాన్నగారి తిధి అగుటచేత, వారికి శ్రాద్ధకర్మ నిర్వహణకు ఉపక్రమించాను. ఆ యజ్ఞము శ్రీకుప్పా ఆంజనేయ శర్మ గారు నిర్వహించారు. అగ్నిహోత్రము, భొక్తలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చడులు, నాలుగు పిండివంటలు, భోక్తలకు సన్మానమునకు ధోవతులు, అంగవస్త్రములు, రాగిచెంబు, హరివేణము, పంచపాత్ర, ఉద్ధరిణ, ఋత్విజునకు సన్మానమునకు విడిగా వస్తుసామాగ్రి నిమిత్తము దక్షిణతాంబూలాదులతో శ్రాద్ధకర్మ సమంత్రకముగా యధావిధిగా నిర్వహించి శ్రీనాన్నగారికి నేను చేయవలసిన ఈ యజ్ఞకర్మ నిర్వహించి సంతుష్టిచెందినాను. ఈ యజ్ఞకర్మకు నా ధర్మపత్ని తనవంతు కార్యము నిర్వహించినది. పార్వణములు పవిత్ర విష్ణుపాదముల వద్ద తాడనము చేసి పాదములకు అర్పణము మరొక ముఖ్య కార్యక్రమము. దాదాపు రెండున్నర గంటలు పట్టిన ఈ శ్రాద్ధకర్మ అనంతరము పితృదేవతల ప్రసాదము స్వీకరించి విశ్రాంతి తీసుకున్నాము.





అష్టాదశ శక్తి పీఠము - మాంగల్య గౌరి దర్శనము - గయ

సాయంకాలము అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన మాంగల్య గౌరి దర్శనము చేసుకున్నాము. ఈ మాత ఆలయము చాలా ప్రశస్తమైనది.

చిన్న ఆలయమైన చాలా మహిమాన్వితమైనదిగా భారతదేశములో ప్రసిద్ధి చెందినది. అమ్మ గర్బాలయము ప్రవేశము చాలా ఇరుకుగా ఉన్నది. గర్భాలయములో ముగ్గురు నలుగురుకు మాత్రమే కూర్చొను స్థలము కలదు. మళ్ళీ ఆ సన్నటి ప్రవేశద్వారము ద్వారా నిర్గమనము వయసుమీరిన వారికి కొద్ది శ్రమగా ఉండగలదు. ప్రక్కనే దుర్గామాత ఆలయము దర్శనము చేసుకొని బసకు తిరిగివచ్చాము.

పితృదేవతలకు "గయాశ్రాద్ధము"

మరుసటి దినము యధావిధిగా పితృదేవతలకు గయాశ్రాద్ధము నిర్వహించడమైనది. ఇది ప్రతి గృహస్తు విధిగా నిర్వహించవలసిన కార్యక్రమము. గయలో పితృదేవతలకు అంటే పితామహుల, మాతామహుల వైపున గతించిన బంధువులకు, స్నేహితులకు, గురువులకు పిండప్రదానము చేసి మనవంతు ధర్మము నిర్వహించుట ప్రధాన ఉద్దేశ్యము. ఇది గయలో చాలమంది తెలుగువారు నిర్వర్తించడము చాలా ముదావహం. ఈ కార్యక్రమము యావత్తూ "విష్ణుపాదముల" ఆలయప్రాంగణములో జరిగినది. మూడు విశాలపత్రములలో ఒక్కొక్క పత్రములో ముప్పైరెండు చొప్పున మొత్తం తొంభైయ్యారు పిండములు తయారు చేసి, సమంత్రకముగా పితృదేవతలకు పిండప్రదానము చేసి, ఆ పార్వణములు విష్ణుపాదములవద్ద అర్పణగావించి, తిరిగి ముప్పై రెండు పార్వణములు గోమాతకు అర్పణముచేసి, చివరి ముప్పైరెండు పార్వణములు పవిత్ర అక్షయవటవృక్షమునకు అర్పించి కృతార్ధుడయ్యాను.






తదుపరి కర్త, అతని ధర్మపత్ని మూడువిధిగా త్యజించవలసినవి త్యజించాము. ( ఓఆకు, ఓకూర, ఓ పండు త్యజించవలసినవి.) అసలు త్యజించవలసినవి అరిషడ్వర్గములు అని పెద్దలు చెబుతారు. సామాన్యులకు అది సాధ్యం కాదు కాబట్టి, ఇష్టమైనవి త్యజించడము అలవాటు చేసుకోవాలి అని భావన.

తిరిగి బసకు చేరుకుని బుద్ధగయ చారిత్రాత్మకము కాబట్టి అది కూడా దర్శనీయ స్థలములో భాగముగా చూచివచ్చాము.






మరునాడు తెల్లవారు ఝామున కాశీప్రయాణమై, మూడురోజులు కాశీవాసము చేసి, శ్రీవిశ్వనాధుణ్ణి, హొలీపున్నమి ముందువచ్చే ఏకాదశిసాయంసమయమున భక్తులు శ్రీస్వామి వారికి రంగులు అర్పించడము ఆనవాయితీ. శ్రీస్వామి దర్శనార్ధము వెళ్ళిన ఇది మాకు అనుకోకుండా కలిగిన మహాధ్భాగ్యము. శ్రీస్వామివారిని అత్యంత రంగురంగులతో అలంకరించి భక్తులకు కనువిందు గావించారు. అమ్మవిశాలాక్షిని, కేదారేశ్వరుణ్ణి, లోలార్కకుండ ఆదిత్యులను, శంకరమఠస్వాములను , ఇతర ఆలయములు దర్శించుకుని ఇంద్రప్రస్త తిరుగుప్రయాణము అయ్యాము. మా కాశీ, గయ తీర్ధయాత్రలు ఈ విధంగా సుసంపన్నము అయినవి. స్వస్తి.

మరిన్ని ఛాయాచిత్రములకు క్రింది లంకె నొక్కండి.

https://plus.google.com/u/0/photos?tab=Xq#photos/105802903792469439891/albums/5859561756970103873



కీసర వంశము***** KEESARAVAMSAM