25 October, 2011

దీపావళి శుభాకాంక్షలు

శ్లో

స్ఫురన్తి సీకరా యస్మా - దానన్ద స్యామ్బరే2వనౌ


సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానన్దాత్మనే నమః



(యోగ వాసిష్ఠం - వాల్మీకి కృతమ్)(వైరాగ్య-1-3)



తా

గుంటలు, చెరువులు, చెలమలు, కాలువలు వాగులు, నదులు మొదలైన

జలాశయములు మనకు కనిపిస్తున్నాయి అంటేనే - వాటికి ఆదిలోనూ,

అంతంలోనూ కూడా - ఒకే ఒక అపార ( సాగరీభూత )జలరాశి ఉండి తీరాలని మనకు తెలిసిందే గదా !



అలాగే చీమ మొదలు బ్రహ్మ వరకు గల సకల ప్రాణులన్నిటియందు కూడా -

జీవనహేతువుగా, జీవనసారంగా, జీవనలక్ష్యంగా ఉంటున్నట్టి -

నానావిధ అల్ప - అధిక - ఆనందాలన్నింటికీ మూల రాశీభూతంగా

అఖండ బ్రహ్మానంద సాగరం ఉండిఉండటంలో అసంబద్ధమైనది ఏమీ లేదుగదా !



సముద్రంలో పైకి తేలే తుంపురులు, నురగలు, తరంగాలను కోరుకునేవారికంటే -

ఆ సముద్రమంతటినీ కోరుకునే వారు మహాశయులు కారా ? అలాగే,

అల్పపరిమాణం కలిగిన, క్షణికమైన, పరాధారితమైన ప్రాపంచిక

విషయసుఖాలకంటే - ఆ నిజాత్మాధారితమైన, సర్వాధిక - అఖండ - శాశ్వత -

ఆనందామృతాన్ని శోధించి సాధించిన మన మహర్షులను మించిన విజ్ఞతములుంటారా !



వారి వారసులమైన మనందరికీ ( పురాణవాఙ్మయం అంతా మానవమాత్రులందరికోసమే )

ఎంతో వాత్సల్యంతో అందించిన విజ్ఞాన సంపదను మనం సక్రమంగా అనుభవిస్తేనే

వారికి ఎంతో సంతృప్తి ! ఆ దిశగా మనం ఒక్క అడుగు ముందుకు వేసినా,

ఋషిఋణం తీర్చుకోవటం మొదలయినట్లే గదా !

కీసర వంశము***** KEESARAVAMSAM