31 March, 2012

శ్రీరామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు




రేపు మనం "శ్రీరామనవమి" పర్వదినమును జరుపుకోబోతున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని "శివ ధనుర్భంగము" గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.



"శ్రీమద్రామాయణము" ఆబాలగోపాలానికి ఆదరపాత్రమైన ఆదికావ్యము. అందులోనూ మన తెలుగువారికి సీతారాములు ఆరాధ్యదైవాలు. తెలుగునాడులో శ్రీరాముని గుడి లేని గ్రామం లేదు. తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. మన గోదావరీతీరం సీతారాముల పవిత్ర పాదపరాగములతో పులకించిపోయింది. అందువల్లనే, రామకథ అంటే తెలుగువారికి అంతులేని అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు, మరే ఇతరభాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు.



"శ్రీరామనవమి"కి తెలుగునాట వాడవాడలా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి, వారి వివాహం ఏవిధంగా సంభవించింది? స్వయంవర నియమం ప్రకారం రఘువీరుడు శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచినందువల్లకదా!-------- ఈ శివధనుర్భంగ సన్నివేశాన్ని వివిధ కవులు తమతమ కావ్యాల్లో అద్భుతంగా వర్ణించారు. ఆ ఘట్టాన్ని కొంతమంది కవీశ్వరులు ఏవిధంగా మన ఎదుట రూపుకట్టించారో స్థూలంగా చెప్పడమే ఈనాటి ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము.



కవులలో ఎవరి శైలీవిన్యాసం వారికి ఉంటుంది.... ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ "రామాయణ కల్పవృక్షము"లో ఈ సన్నివేశాన్ని ఎలా వర్ణించారో తెలుసుకుందాము. వారు ఈ సందర్భంగా ఆణిముత్యాల వంటి 2 పద్యములను మనకు అందించారు.



అందులో మొదటి పద్యమును చిత్తగించండి.



నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత

స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం

హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా

ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్





ఆలంకారికులు కవిత్వమును స్థాయీభేదములను బట్టి 3 విధములుగా వర్గీకరించినారు. ఆ త్రివిధములైన ద్రాక్షాపాక, కదళీపాక, నారికేళపాకములలో నారికేళపాకము కఠినంగా ఉంటుందని, సులభంగా అర్థంకాదనీ అంటారు. ఐతే, చాలామంది విశ్వనాథవారి శైలిని పాషాణపాకమనీ, అది నారికేళపాకము కన్నా ప్రౌఢంగా ఉంటుందనీ చెప్తారు. విశ్వనాథవారు అలతి అలతియైన తేలికపదములతో వ్రాసిన పద్యములు లేకపోలేదు; అవి చాలా తక్కువ!



"రామాయణ కల్పవృక్షము" లోని పద్యములన్నింటిలోకి పై పద్యమే మిక్కిలి కఠినమైనదని చెప్పవచ్చును. ఐతే, అంత కఠినంగా ఉండుటయే ఈ పద్యము యొక్క సార్థక్యము, సౌందర్యము!



శ్రీరామచంద్రుడు శివధనుర్భంగము చేసినపుడు, ఆ ఛిన్న చాపము నుండి వెడలిన పరమదీర్ఘమైన, పరమకఠోరమైన ధ్వనిని స్ఫురింపజేయుట ఈ పద్యము యొక్క ప్రయోజనము. "ద్రాఘిష్ఠమ్మై ఒక రావము అంతట నెసంగెన్" అన్నారు. "రావము" అంటే శబ్దము; "ద్రాఘిష్ఠము" అనగా దీర్ఘతమము. పద్య ప్రారంభము నుండి 3 పాదములదాకా విస్తరించి సాగిన సంస్కృతసమాసము ఆ వింటిధ్వని యొక్క దీర్ఘత్వమును అమోఘంగా సూచిస్తున్నది.



ఇప్పుడు పద్యభావమును పరికిద్దాము.



"ఎడతెగకుండ వర్షించుచున్న అమోఘమైన మేఘముల సమూహము నుండి మిక్కిలిగా వచ్చు మెరుపుతీగలతో పాటు విజృంభించు పిడుగుల సమూహముల యొక్క ఘుర్ఘురధ్వనిని తక్కువ చేయునట్లుగా మిక్కిలి దీర్ఘమైన ఒక రావము ధనుస్సు నుండి వెలువడెను" అనేది ఈ పద్య తాత్పర్యము.



పద్యభావమును అవగతం చేసుకోలేకపోయినా, కేవలం పద్యమును చదివినంతమాత్రము చేతనే ఆ భీకరధ్వనిని ఊహించగలుగుతారు చదువరులు! అదే కవీశ్వరుల ప్రతిభ! ఈ పద్యములో విశ్వనాథవారు షకారముతో కూడిన ఠకారముతో దుష్కరమైన ప్రాసను వేసినారు. ద్వితీయ పాదారంభములో "స్పేష్ఠే" అనే పదము ధనుర్భంగ సందర్భములోని విస్ఫోటమును అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. మరి, ఇంతటి భయంకరమైన రావమును వర్ణించడానికి తేలికపదములను వినియోగిస్తే, మీసములు లేకుండా భీమసేనుని వేషము వేసినట్లుగా ఉంటుంది!...... అందుకే విశ్వనాథవారు అంత కఠినమైన సుదీర్ఘ సమాస ప్రయోగం చేశారు.



ఇక, 2వ పద్యములో ఆ భీకరధ్వని యొక్క కాఠిన్యము ఎటువంటిదో వివరిస్తున్నారు.



హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై, షణ్ముఖ

స్ఫార ద్వాదశనేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక

న్యారాజన్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై, ఆశ్చల

ద్గీరుగ్ర ప్రమథంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్

ఆ వింటిధ్వని వినాయకుని చేటలవంటి చెవితొఱ్ఱలకు సిగ్గును కలిగించినదట! గణేశుడు గజముఖుడు కదా! అందుకే ఆయనవి శూర్పకర్ణములు, అనగా చేటలవంటి విశాలమైన వీనులు! అటువంటి విశాల కర్ణములకే ఆ నాదము శ్రవణభీకరంగా ఉన్నదంటే, ఇక మామూలు మానవులకు ఎలా ఉండివుంటుంది!!.... ఇంకా ఏమంటున్నారో చూడండి. షణ్ముఖుడైన కుమారస్వామి విస్మయముతో తన 12 నేత్రములను విప్పార్చి చూచునట్లుగా చేసినదట ఆ రావము! కుమారస్వామి 6 శిరస్సులను కలిగినవాడు, అనగా 12 నయనములు! ఇకపోతే, గిరిరాజసుతయైన పార్వతీదేవి సైతం ఆ భయంకర నాదాన్ని విని, అప్రయత్నంగానే తన భ్రుకుటిని ముడివేసినదట! ఆమె అందమైన లలాటఫలకం ఆశ్చర్యముతో ముడివడిపోయినదట! ఇక, శివపార్వతులను సేవించే ప్రమథగణాలన్నీ ఆ భీకర విస్ఫోటన ధ్వనిని విని భయముతో "ఆఃప్రకట" రావము చేస్తూ అచేతనులు అయినారట!.... ఈవిధంగా "ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్".



శివధనుర్భంగము యొక్క పరిణామము కైలాసములో, కైలాసవాసులలో ఏ రకంగా ప్రతిఫలించినదో విశ్వనాథవారు ఈ పద్యములో ఎంతో హృద్యంగా వర్ణించారు. అది శివుని ధనుస్సు కాబట్టి, శివలోకమైన కైలాసములో కలిగిన అల్లకల్లోలమును వారు మన కళ్ళకు కట్టారు.



"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు మధురకవిగా ప్రసిద్ధులు. ఎంతటి గంభీర విషయమునైనా అలవోకగా మృదుమధురమైన ఫణితిలో చెప్పగలగడం వారి ప్రత్యేకత!... మరి, శివధనుర్భంగాన్ని వారి మాటలలో విందాము.



ఫెళ్ళుమనె విల్లు! గంటలు ఘల్లుమనే!

గుభిల్లుమనె గుండె నృపులకు!

ఝల్లుమనియె జానకీ దేహము!

ఒక నిమేషంబునందె నయము, జయము, భయము, విస్మయము గదుర!



శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగినది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగినవి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది..... ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యములోనే అక్కడి వాతావరణాన్ని మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపినారు పాపయ్యశాస్త్రిగారు!.... ఒక్క నిమిషములోనే నయము, జయము, భయము, విస్మయము ప్రతిఫలించినాయట ఆ సభాస్థలిలో! విల్లు ఫెళ్ళుమనడానికి నయము, గంటలు ఘల్లుమనడానికి జయము, నరపతుల గుండెలు గుభిల్లుమనడానికి భయము, వైదేహి దేహము ఝల్లుమనడానికి విస్మయము ప్రతీకలు! ముందు 4 విషయములను చెప్పి, చివరి పాదములో నయము, జయము, భయము, విస్మయములను ఉటంకించి ఈ చిన్నిపద్యమును క్రమాలంకారములో తీర్చిదిద్దినారు కరుణశ్రీ!



ఇక, చివరగా మన సమకాలికుడైన ఒక ఆధునిక కవి గురించి తెలుసుకుందాము. ప్రముఖ సినీనిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు మంచి సాహితీపరులు. వారు తాము నిర్మించిన చిత్రాలలో పాటలు కూడా వ్రాస్తుంటారు. ఆయన గీతాలు చక్కని పదముల పొందికతో శ్రవణసుభగంగా ఉంటాయి. ఆయనను "సహజకవి, మల్లెమాల" అని పిలుస్తారు. బహుశా "మల్లెమాల" అనేది వారి ఇంటిపేరు కాబోలు! వారు రచించిన "మల్లెమాల రామాయణము" కొన్నాళ్ళ క్రితం టివి లో ఉదయంవేళల్లో ధారావాహికగా ప్రసారమయింది. ఆయన తన కావ్యములోని పద్యాలను చదువుతూవుంటే, మరొక సాహితీవేత్త దానికి వ్యాఖ్యానం చెప్పేవారు.



మరి, మల్లెమాలగారి "శివధనుర్భంగము" ఎలావుందో చూద్దాము.



ఫెళఫెళార్భటు లెనయంగ విరిగె ధనువు

భళిభళీ యని శుభమస్తు పలికె గురువు

ప్రీతిమెయి పులకించె భూమాత తనువు

తెలియకనె సీత మోమున మొలిచె నగవు

పద్యము చాలా సులభగ్రాహ్యంగా ఉంది; విడమరచి చెప్పవలసిన పని లేదు. 3వ పాదములో "పులకించె భూమాత తనువు" అన్నారు. సీత భూజాత కదా! తన కుమార్తెకు వివాహం జరగబోతుంటే ఏ తల్లి తనువు మాత్రం పులకించదు?!....... ఇక్కడ మరో అర్థం సైతం చెప్పుకోవచ్చు. జనులందరూ భూమాత ఒడిలోనే కదా ఉండేది! ఆమె తనువు పులకించినదని అంటే, పృథ్విపైనున్న సకల జీవుల తనువులు పులకించాయన్నట్లే!



"శివ ధనుర్భంగము" ఘట్టమును వివిధ కవులు ఎలా వర్ణించారో, నాకు తెలిసినంతలో వివరించే ప్రయత్నం చేశాను.







కీసర వంశము***** KEESARAVAMSAM