02 April, 2012

కర్మానుభవము-పూజాదికముల ఫలము

కర్మానుభవము-పూజాదికముల ఫలము


అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం" అన్న మాట మనమందరమూ తరచుగా వింటూ ఉండేదే. మనము చేసుకొన్న మంచి, చెడుపనుల ఫలితాలను మనమే అనుభవించక తప్పదని దీని తాత్పర్యము. మన జీవితం దీని ఆధారంగానే నడుస్తూ ఉంటుంది. "ఎలాగూ కర్మ ఫలాన్ని అనుభవించడము తప్పదు గదా, అటువంటప్పుడు ఈ జపతపాదులూ, ధ్యానమూ, పూజాదికాలు ఎందుకు చేయాలి?" అని చాలా మంది అడుగుతూ ఉంటారు.

పైపైన చూస్తే ఈ ప్రశ్న చాలా తర్కబద్ధమైనదిగానూ, సహేతుకమైనదిగానూ, సహజమైనదిగానూ అనిపిస్తుంది. ఈ పూజాదికాలు, మంత్రజపాలూ, సాధనలూ అన్నీ నిష్ప్రయోజనమని అనిపించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే దీన్ని గురించి మరింత లోతైన విచారణ చేయవలసి ఉన్నది. లోతైన విచారణ చేస్తే కొన్ని ధర్మ సూక్ష్మాలుగోచరిస్తాయి.

ఇక్కడ అనుభవిచడమంటే ఏమిటన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న విచిత్రంగా కనిపించినా చాలా అర్థవంతమైనది. ఉదాహరణకు, మనం హాయిగా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఒక భయంకరమైన కల వచ్చిందనుకోండీ. కౄరులైన దొంగలు మనవెంటపడి, చేతులు కాళ్ళు నరికి మనదగ్గరున్న డబ్బంతా దోచుకొని మనలను నట్టడవిలో వదలి వెళ్ళినట్లు కలగన్నామనుకోండి. ఈ కలకంటున్నంతసేపూ, ఇది కేవలం కల మాత్రమే, నాకేమీ కాలేదు అని భావించి హాయిగా ఉండగలుగుతున్నామా లేక వాస్తవిక ప్రపంచంలో మనకు ఈ దుస్సంఘటన జరిగితే ఎంత బాధ అనుభవిస్తామో అంత బాధా అనుభవించామా? నిస్సందేహంగా అంత ఘోరమైన వేదనా అనుభవించాముగదా? నిద్ర లేచాక గూడా కాళ్ళూ చేతులూ తడిమి చూసుకొని, అమ్మయ్యా నాకేమీ కాలేదు అని హాయితో కూదిన ఒక నిట్టూర్పు విడుస్తున్నామే. మరి కర్మఫలము అనుభవించినట్లా లేక అనుభవించనట్లా? అంటే స్థూల శరీరంతో పొందే అనుభవానికీ, సూక్ష్మ శరీరంతో పొందే అనుభవానికీ ఏమాత్రమూ తేడా లేదన్న విషయాన్ని సులభంగానే గ్రహించవచ్చును.

బలంగా పేనిన ఒక లావుపాటి మోకు (తాడు)తో, మనము సాధించుకొన్న కర్మఫలాలను పోల్చి చూద్దాము. ఆతాడులాగే అవికూడా చాలా బలంగా, తెంచడానికి వీల్లేనంత గట్టీగా ఉంటాయి. కానీ అదే తాడును ఉన్న పళంగా తగులబెట్టామనుకోండి. బూడిదగామారిన ఆతాడు, గాలికి చెదరి పోయేటంత వరకూ చూడటానికి తాడులాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ మునుపటి గట్టితనం గానీ, బంధించగలిగే శక్తి గానీ దానికి ఉండవు. తాకుతూనే పొడి పొడిగా మారిపోతుంది. చిత్తశుద్ధితో చేసే జప తపాలూ, దైవనామ సంకీర్తన, సత్సంగమూ, పూజాదికాలు సరిగ్గా ఇటువంటి పనినే చేస్తాయి. బలంగా ఉన్న కర్మఫలాలు అనే పాశాలను దహనం చేసి, శిథిలం చేసి, తేలికగా అనుభవించి పోగొట్టుకోగలిగేటట్లు చేస్తాయి. ఈ విధంగా అనేక జన్మలెత్తి అనుభవించ వలసిన కర్మఫలాలను కూడా జప తపాదులు, దైవనామ సంకీర్తన, సత్సంగమూ, పూజాదికాలు, స్థూలశరీరంతో అనుభవించే బదులుగా సూక్ష్మ శరీరంతో అనుభవించి పోగొట్టుకోగలిగేటట్లుచేసి, కర్మక్షయాన్ని శీఘ్రతరం చేస్తాయి.

ఈ విధంగా ఒక వైపు సూక్ష్మశరీరంతో అనుభవించడం ద్వారా కర్మఫలాన్ని శీఘ్రంగా నిశ్శేషం చేసుకోడంతోపాటుగా, శేష జీవితాన్ని నిష్కామకర్మలు గావిస్తూ, వాసనలను, అనుబంధాలనూ పెంచుకోకుండా గడపగలిగితే ఇదేజన్మనే మనం చివరి జన్మగా చేసుకోవచ్చును. ఎందుకంటే కర్మఫలాన్ని నిశ్శేషం చేసుకోవడానికీ, మనలో తలెత్తుతున్న వాసనలనూ, కోరికలనూ సంపూర్తి చేసుకోవడానికే గదా జన్మపరంపర ప్రాప్తిస్తున్నది. చాలా ఉన్నతమైన, తీవ్ర స్థాయిలో, తీవ్రమైన ఆర్తితో చేసే జపతపాలు, అనుష్ఠానాల ద్వారాపొందగలిగిన స్థితి ఇది.

ఇంకా అనేక స్థాయిలలోకూడా ఈ విషయాన్ని పరిశీలిద్దాము. కర్మఫలం చాలా బలీయంగా ఉండి, మనం చేస్తున్న పూజాదికాల స్థాయి అంత ఉన్నతంగా, తీవ్రంగా లేక పోయినప్పటి పరిస్థితి ఏమిటి?

ఉదాహరణకు, బలీయమైన కర్మఫలాన్ని తీవ్రమైన సూర్యతాపంతో పోల్చి చూద్దాము. ఎండయొక్క కాంతినీ, ఉష్ణతీవ్రతనూ ఎవ్వరూ తగ్గించలేరు. అది ఎంత ఉందో అంతే ఉంటుంది. అటువంటి ఎండలో మనము శరీరానికి కానీ. పాదాలకు కానీ ఎలాంటి అఛ్ఛాదనా, రక్షణా లేకుండా వెళ్ళవలసి వస్తే ఆ బాధానుభవము భరించరానంత తీవ్రముగా ఉంటుంది గదా? కానీ పలుచటి తెల్లటి నూలు వస్త్రాలూ, కంటికి నల్ల కళ్ళద్దాలూ, కాలికి జోడూ, తలకు టోపీ, చేతిలో గొడుగూ ధరించి వెళ్ళితే కలిగే బాధ చాలా తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. మనము తేలికగా అనుభవించగలిగే స్థాయిలోనే ఉంటుంది. ఈ విధంగానే మనం చేసే పూజాదికాలు, సత్కర్మలు బలీయమైన కర్మఫలాన్ని కూడా మనము తేలికగా అనుభవించి పోగొట్టుకోగలిగిన స్థాయికి తీసుకొని వస్తాయి. ఈ ఉదాహరణ ద్వారా, ఎంతటి స్థాయిలో చేసేవైనా మనం చేసే పూజా పునస్కారాలు, జపతపాదులూ వ్యర్థంగా పోవని తేటతెల్లమౌతున్నది గదా!

ఇదే విషయాన్ని ఇంకొక స్థాయిలో కూడా పరిశీలిద్దాము. మనం అనుభవించితీరవలసిన కర్మఫలం అత్యంత బలీయం గానూ, తీవ్రం గానూ ఉండి ఏమాత్రమూ తగ్గించగలిగిన స్థాయిలో లేదనుకొందాము. అయినా నిరాశ చెందనవసరం లేదు.

మనం చేసే పూజాది సత్కర్మలు మనకు కర్మఫలాన్ని ప్రశాంతంగా, నిశ్చింతగా అనుభవించగలిగే శక్తినీ, స్థిత ప్రఙ్ఞత్వాన్నీ ప్రసాదిస్తాయి. మిన్ను విరిగి మీదపడినా చలించకుండా ఉండగలిగే అచంచలమైన స్థైర్యాన్ని దైవానుగ్రహం వల్ల పొందగలము. ఎంతటి ఘోరవిపత్తునైనా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అనుభవించడం కన్నా, చిరునవ్వుతో, హాయిగా, స్థిరచిత్త్తంతో అనుభవించగలగడం గొప్ప విషయమే గదా. ఈ శక్తిని పూజాఫలంగా పొందగలిగిన వారినెందరినో మనము నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాము. మనము కూడా ఆ శక్తిని తప్పక సాధించగలము. లభించినది ఘోరాతి ఘోరమైన బాధే ఐనప్పటికీ కూడా "సర్వమున్ అతని దివ్య కళామయమంచు" భావన చేయగలిగే ఉత్తమ సంస్కారము, తత్ఫలంగా లభించే మనశ్శాంతి దైవానుగ్రహఫలమే గదా.

ఈసందర్భంగా ఇక్కడొక విషయాన్ని గురించి కూడా ప్రస్తావించుకోవాలి. కర్మ మూడు రకాలు అని పెద్దలు చెబుతారు. అవి:

Ø సంచితకర్మ

Ø ప్రారబ్ధ కర్మ

Ø ఆగామి కర్మ

మనం అనేక జన్మలుగా చేసుకొన్న సత్కార్యాలు, దుష్కార్యాల ఫలితంగా సంపాదించుకొన్న కర్మఫలాన్ని సంచితకర్మ అంటారు. కొండల్లాగా పడిఉన్న ఈ సంచితకర్మనుండి, ఈ జన్మ ఎత్తేముందు జీవుడు అనుభవించి క్షయం చేయడానికి తెచ్చుకొన్న కర్మను ప్ర్రారబ్ధ కర్మ అంటాఋ. ఇప్పుడు ఈ జన్మ ఎత్తిన తర్వాత మరలా మనం చేసే సత్కార్యాలు, దుష్కార్యాల ఫలంగా, మరలా సంచిత కర్మలో చేరిపోయి, రాబోయే జన్మకు ప్రారబ్ధ కర్మ గా పరిణమించబోయేది ఆగామి కర్మ.

ఇఫ్ఫుడు ప్రారంభమైన కర్మ అనగా ప్రారబ్ధకర్మ విడిచిన బాణంలాంటిది. ఈ జన్మలో మన జీవిక ఎలా సాగిపోవాలో నిర్ణయించబడి ఉంటుంది ప్రారబ్ధ కర్మ ద్వారా. దీన్నే ఈ జన్మకు "విధి" (Pre-Destination)అని అనవచ్చు.

చాలా సందర్భాల్లో ఒక చర్చ తలెత్తుతూ ఉంటుంది. మనిషికి ఏమైనా చేయడానికి స్వేచ్చ ఉంటుందా లేక అంతా ప్రారబ్ధ కర్మ ద్వారా నిర్ణయించబడిన ఒక పూర్వ నిర్ణీత ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుందా? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా లేవనెత్తబడుతూ ఉంటుంది. దీన్నే”What is true, Free will or Pre-Determination?” అన్న చర్చగా భావించవచ్చు.

నిజానికి రెండూ సరియైనవే. మనిషికి నిర్ణయ స్వేఛ్ఛా(Free will) ఉన్నది అలాగే పూర్వ నిర్ణీత ప్రణాళికా(Pre-Determination) ఉన్నది. వినడానికి ఇది చాలా విడ్డూరంగానూ పరస్పరవిరుద్ధ విషయం గానూ అనిపిస్తుంది. దీన్ని గురించి కొంత విపులమైన చర్చ జరిపి, సమన్వయం ఎలా సాధ్యమౌతుందో చూద్దాము. పూర్వజన్మలలో తాను చేసుకొన్న సత్కర్మలు, దుష్కర్మల ఫలితంగా ఒక పూర్వ నిర్ణీత ప్రణాళిక్గ ఈ జన్మ కొరకు సిద్ధమయ్యే ఉంటుందన్న మాట సంపూర్ణంగా సత్యమే. కానీ దీనికీ ఒక పరిమితి ఉంది. ఏదో ఒక కార్యాచరణను ఎంపిక చేసుకొనవలసిన పరిస్థితులను కల్పించడం వరకూ (Destiny or Pre-Determination) పుర్వ నిర్ణీత ప్రణాళిక తన పాత్ర నిర్వహిస్తుంది. కానీ ఇక్కడవరకూ వచ్చిన తర్వాత మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలా, లేక చెడు మార్గాన్ని ఎంపిక చేసుకోవాలా అన్నది మన వివేకాని(Wisdom)కి, స్వేచ్చ(Free-Will)కు వదలి వేయ బడుతున్నది. ఇక్కడ మనకు సంపూర్ణమైన స్వేచ్చ ఉన్నది. ఇప్పుడు మనం చేసుకొనే ఎంపిక రాబోయే జన్మలో మన విధి (Destiny or Pre-Determination) ని నిర్ణయిస్తుంది.

ఒక చిన్న ఉదాహరణతో మనం దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు:

మనం ఒక మిత్రుని ఇంటికి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరనుకోండి. ఎక్కడో లోపల బాత్రూంలో మన మిత్రుడు స్నానం చేస్తూ ఉంటాడు. మీరు అతనిని పిలవగానే, "అలా సోఫాలో కూర్చో. కాస్సేపట్లో వస్తాను" అని సమాధానమిచ్చాడు. అక్కడ టేబుల్ మీద ఒక పదివేల రూపాయల నోట్ల కట్ట ఉంది. దాన్ని మనం తస్కరించినా ఎవరికీ అనుమానం రాదు. మన ఆర్థిక సంపన్నతా, మనమీద అతనికి గల విశ్వాసం, మన స్నేహం అటువంటివి.

మరి ఈ పరిస్థితిలో గుట్టు చప్పుడు కాకుండా ఆ నోట్ల కట్టను జేబులో వేసుకొని, "మళ్ళీ వస్తాలేరా" అని చెప్పి జారుకోవచును. ఇది ఒక ఎంపిక (one choice), లేదా, "ఇంత అజాగ్రత్త పనికిరాదు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం" అని మన నేస్తానికి నాలుగు చీవాట్లు పెట్టి, డబ్బును అతనికే అప్పగించి రావడం ఇంకొక ఎంపిక (another choice). ఈ పరిస్థితి కల్పించి ఈ రెంటిలో నుంచి ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించడం వరకూ (పూర్వజన్మల కర్మల ఫలితంగా, మనం తెచ్చుకొన్న ప్రారబ్ధ కర్మచే ఏర్పడిన) విధి (Destiny or Pre-Determination) తన పాత్ర నిర్వహిస్తున్నది. ఇక్కడ నుంచి మన స్వేచ్చకు అవకాశం లభిస్తున్నది (From here the Free-Will comes into operation).దుష్కార్యాన్ని చేసి మరింత ఛెడుకర్మ లేక దుష్కర్మను మూట కట్టుకోవడమా లేక సన్మార్గంలో ప్రవర్తించి రాబోయే జన్మకు మూలధనంగా సత్కర్మను సాధించుకోవడమా అన్న స్వేచ్చావరణం (Freedom to exercise Free-Will) మనకు సంపూర్ణంగా ఉన్నది.

సరిగ్గా ఇటువంటీ పరిస్థితి ఎదురైనప్పుడు, అంటే దుష్కర్మ, సత్కర్మల మధ్య ఎంపిక చేఉకోగలిగే అవకాశం మనకు లభించినపుడు, సత్కార్యాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని సత్కర్మను సాధించుకోగలిగే సద్బుద్ధిని ప్రసాదిస్తాయి మనం చేసుకొనే పూఃజాదులు, జపాలు, మహాత్ముల చరిత్ర పారాయణలు, దైవనామ సంకీర్తన వంటివి. ఈవిధంగా ప్రారబ్ధ కర్మ తీవ్రతను తక్కువ చేయడమో, శిధిలం చేయడమో, లేక కనీసం అనుభవించగలిగే స్థాయికి దించడమో మాత్రమే గాక సంచిత, ఆగామి కర్మలను కూడా నిర్ణయించగలుగుతాయి మనం చేసే పూజాదికాలు

"పూజాదికాలు-కర్మానుభవము" అన్న విషయాన్ని గురింఛిన చర్చ ముగించబోయే ముందు, గురునానక్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనను గూర్చి చెప్పుకోవాలి.

గురునానక్ వద్దకు ఇద్దరు భక్తులు వస్తూ ఉండే వారు. వారిలో ఒకరు మంచి కర్మలు చేస్తూ ఉత్తమ జీవితాన్ని గడిపేవాడు. రెండవ వాడు స్త్రీవ్యసన పరాయణూడు, పచ్చి వ్యభిచారి. ఒక రోజు మంచి ప్రవర్తన కలిగిన ఉత్తమ భక్తుడు గురునానక్ దర్శనానికి వస్తున్న సమయంలో అతనికి కాలికి ముల్లు గుచ్చుకొని చాలా బాధ పెట్టింది. వ్యభిచారియైన వాడు ఒక రోజు వేశ్య వద్దకు వెళ్ళలేదు. గురునానక్ దర్శనానికి వెళ్ళాలనిపించి బయలుదేరాడు. త్రోవలో అతనికి ఒక కుండ దొరికింది. అందులో నిండుగా బొగ్గులు, ఒక బంగారు నాణెము దొరికాయి. వారిద్దరూ గురునానక్ ను సమీపించి తమ అనుభవాలు వినిపించి వివరణ కోరారు. గురునానక్ ఇలా చెప్పారు: సన్మార్గుడైన భక్తునికి పూర్వజ్నమ కర్మ ఫలంగా కాలికి నాగలికర్రు గుచ్చుకొని, కాలు తీసివేయవలసి ఉండినదనీ, కానీ అతని భక్తి వల్ల అంత తీవ్రమైన దుష్కర్మ ఫలంకూడా ముల్లు గుచ్చుకొంటే తీరిపోయే స్థాయికి వచ్చిందనీ చెప్పారు.

అలాగే బంగారునాణేలతో నిండిన కుండను పొందవలసిన రెండవవ్యక్తి తన వేశ్యా లాలస అనే దుష్కర్మ వల్ల అవన్నీ బొగ్గులుగా మారి, వేశ్యా సాంగత్యం ఒక్కరోజు చేయకుండా, గురు దర్శనం చేసినఫలితంగా ఒక్క బంగారు నాణెం లభించిందనీ చెప్పారు. ఇలా కర్మానుభవ సూక్ష్మాన్ని వివరిస్తారు గురునానక్.

మెట్టవేదాంతపు పలుకులు వల్లిస్తూ మనకు విధించబడిన కర్మలను (దైవ, పితృ,కర్మలను) ఆచరించడం ద్వారా మనం పొఆపాన్ని మూట కట్టుకొంటున్నామే గానీ ఉత్తమ స్థితిని చేరుకోవడం లేదన్నది నిష్ఠుర సత్యం. ఏ విధంగా చూచినా పూజాది సత్కర్మలు మనివేయదగినవి కావని ఈ చర్చ ద్వారా తేలుతున్నది. నిరంతరంగా, నిశ్చల, స్థిర చిత్తంతో చేసిన జపతపాదులు మనలను పునీతులను చేసి, ఙ్ఞానసాధనకు అనుకూలమైన స్థితికి చేరుస్తాయి. "మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి” అన్న ఆదిశంకరుల పలుకులు ఈ సమయంలో స్మరించుకోదగ్గవి. కనుక మనకు విధించబడిన, ఆర్యోక్తమైన దైవికకార్యాలు, సద్గ్రంధ పారాయణమ్ గురూపదిష్టమైన మంత్రజపాదులు చేసుకోవడం, సత్పురుషుల, మహాత్ముల, సాంగత్యం చేయడం మనకు అత్యంత శ్రేయస్కరమైన విషయాలని గ్రహించవలసి ఉన్నది.

//మంగళం మహత్//

కీసర వంశము***** KEESARAVAMSAM