అంతర్ముఖ సమారాధ్య
"అంతర్ముఖ సమారాధ్య" అని శ్రీ లలితా సహస్ర నామం లో ఒక నామం . అలా ఎలా సాధ్యమో, ఎలా సాధించాలో చెప్పగలరా? ఒక మిత్రురాలు అడిగారు.
ఈ ప్రశ్నకు సమాధానము చాలా విస్తృతముగా చెప్పవలసి వస్తుంది. అంతవ్రాస్తే, గురుద్రోహము చేసినవాడిని అవుతాను.
కానీ గురువులు మనలను ఎంతవరకు చెప్పమన్నారో అంతే చెప్పి ముగిస్తే, ఉభయతారకముగా ఉంటుందని, గురువులను స్మరిస్తూ ఆరంభిస్తాను. శ్రీ గురుభ్యోనమ:
ఇది శ్రీ లలితా సహస్రనామములోని అతి గోప్యమైన మంత్రవిభాగము. శ్రీవిద్యా ఉపాసకులు దీనిని శ్రీచక్రపూజ అనడము కద్దు.
మన మనస్సు బాహ్య విషయాలలో పడి విక్షేపాలకు లోనయ్యి విచక్షణా జ్ఞానము కోల్పోయి మనలను అధోగతి పాలు చేస్తున్నది అని కాస్త సాధన చేసినవారికి తెలుస్తునే ఉంటుంది.
కాబట్టి మనస్సుని అదుపులోనికి తెచ్చుకుని అహంకారమును జయించి సద్భుద్ధితో సాధన చెయ్యమని భగవానుడు భగవద్గీతలో మనకు బోధించాడు.
మనస్సు తామస, రాజసిక విషయములలోనికి పోకుండా సాత్విక విషయాస్తితో సాధనాక్రమములో సాధకుడు అభివృద్ది చెందాలంటే పంచేద్రియాలకు సాత్వికాహారాన్ని అందించాలని చాంద్యొగ్యము చెపుతోంది. అలా స్వాతిక దిశగా మారిన మనస్సు మీరు ఎలా వంచుతే అలావంగుతుంది. (అంటే సద్భుద్దితో గూడిన మీరు). అప్పుడు ఆ సాత్వికదశ కూడా దాటి శుద్దసాత్వికము పొందిన మనస్సు ఆత్మలో లీనమవుటయే మోక్షము. అది తురీయావస్థ అని జ్ఞానుల అనుభవము తెలుపుతోంది.
అయితే మనస్సును సాత్వికదశకు ఏలా మళ్ళించాలో కాస్త చెప్పుకుందాము.
మనస్సు మనం తినే ఆహారం ద్వారా పనిచేస్తోందని "చాందోగ్య ఉపనిషత్ " చెపుతోంది.
కంటి ఆహారము చూసే చూపులు, చెవులకు ఆహారం శ్రవణం, చర్మానికి స్పర్శ, జిహ్వకు తినే పదార్ధములు, ముక్కుకు ఆహారము మనము పీల్చే గాలులు. ఈ ఇంద్రియాలకు ఇచ్చే ఆహరము సాత్వికము గా ఉంటే, మనస్సు సాత్వికముగా ఉంటుంది. రాజసాహారము ఇస్తే, మనస్సు రాజసమవుతుంది. తామసాహారము ఇస్తే మనస్సు తామసమవుతుంది.
ఇక్కడ కాస్త ఆగి భగవద్గీతలో మన స్వామి ఇంకా ఏమి సాధనా క్రమము ఇచ్చాడో చూద్దాము. ఆరో అధ్యాయములో మన స్వామి మనం సాధనకు ఎలా కూర్చోవాలో ఎలా నాసికాగ్రము మీద దృష్టి పెట్టాలో చాలా వివరంగా చెప్పారు. భగవానుడు శ్వాస మీద దృష్టి నిలపని గట్టిగా చెప్పారు
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్|| 6-13 ||
ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును.
శ్వాసనియంత్రిచడము ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యభాగమని సర్వులు అంగీకరిస్తున్నారు.
ఈ శ్వాస నియంత్రణ ముఖ్యంగా రెండు రకాలుగా చెయ్యవచ్చును.
మొదటిది : ప్రాణ ప్రత్యవీక్షణ
దీనిలో మన నాసికలలోని సూర్యనాడి, చంద్రనాడుల ద్వారా ప్రవహించే శ్వాసను చూస్తూ, సహజ కుంభక స్థాయి చేరటము ద్వారా తురీయ దశను పొందటము అనే యోగ ప్రక్రియ. ఇది సద్గురువుల ద్వారా అభ్యసించ వలసినది.
రెండవది ప్రజ్ఞా ప్రత్యవీక్షణ
ఈ యోగ ప్రక్రియలో చరాచర జగత్తు స్వామి ప్రజ్ఞయో అని తలంచి ఆ ప్రజ్ఞను వీక్షించడమే. అంటే దృక్కులు అలా ఒక్కచోటే నిలిపి ఉంచి అలా చూస్తూ ఉండడమే. అలా దృష్టి నిలిపి వున్నా సహజ కుంభకము సాధించవచ్చని జ్ఞానులు నిశ్చయముగా చెపుతున్నారు. ఇది మరొక యోగప్రక్రియ .
అలా విశ్వమంతా వ్యాపించివున్న శ్రీ తత్వము ప్రతిమనిషిలోను అంతర్లీనమై ఉన్నది.
ప్రతి మనిషి లలాటం లో శ్రీ తత్వాన్ని చూడ వచ్చు అని శ్రీ గబ్బిట వారు తమ బ్లాగులో ఇలా అన్నారు. ‘’లోకానతేత్య లాలతే ,లలితా తేన సోచ్యతే ‘’అంటే అమ్మ వారికి లలిత అన్న పేరు ఆమె లోకానికి అతీత యై లోక లీలను లాలిస్తుంది .కనుక ప్రతి వ్యక్తీ లలాటం అ లీల దామమే .కావలసింది దాని పై ధ్యాస మననం అవగాహనా మాత్రమె .దీనికే ఈ లలితా సహస్ర నామాలు సాధనాలు అవుతాయి .అది పఠిస్తుంటే శ్రీ తత్త్వం బోధ పడుతుంది .ఉపాసకులు శ్రీ చక్ర పూజ చేస్తారు .ఇదొక విశిష్టమైన యంత్రం .ఇందులో బిందు ,త్రికోణ ,వలయ రేఖ ,దళాల వంటి చిహ్నాలుంటాయి ఇవి ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్టితి లయాలకు ప్రతీకలు .ఈ లక్షణాలన్ని మానవ శరీరం లోనే ఉన్నాయని మనం మర్చి పోతూంటాము .శరీరమే శ్రీ చక్రానికి ప్రతి రూపం అని తెలియాలి .ఇందులోని తొమ్మిది ఆవరణలే మన నవ రంధ్రాలు .అందులోని ఆనంద మయ బిందువే లలాటం మీద ఉన్న సహస్రార చక్రం .ఇదే అమ్మ వారి పవిత్ర నివాసం .శ్రీ చక్రం మన పుట్టుక తోనే వచ్చే పరమాత్మ సాధనం .
శ్రీ విద్య శ్రీ మాతను ప్రసన్నం చేయటానికి దోహద పడుతుంది .లలితా సహస్రనామ పఠనం ఈ మంత్రం ఫలాన్నిస్తుంది .దేవి కృప అంతర్ముఖమైన వారికే లభిస్తుందని మరువ రాదు .అంటే భావన చాలా ముఖ్యం అందుకే ‘’అంతర్ముఖ సమారాధ్యా –బహిర్ముఖ సుదుర్లభా ‘’అన్నారు భవానీ భావనా గమ్యా అనటం భావనే ముఖ్యమని .భావన అంతర్ముఖం అయితే పిండాండం లో బ్రహ్మాండ దర్శనం లభిస్తుంది .ఇదే శ్రీ దేవి ఆరాధనా పరమ లక్ష్యం .దీని శ్రీ సహస్రిక అమోఘమైన సాధనం
శక్తి దేశాకాల ను బట్టి వివిధ రూపాలు ధరిస్తుంది ‘’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా –సాసా సర్వేశ్వరీ దేవీ శక్తిమంతో మహేశ్వరః "
ఇంతవరకు చెప్పేటందుకే సద్గురువుల అనుగ్రహము ఉన్నది. ఇఖ ముందు అంతా గురువుల ముఖత: విని అభ్యసించవలసినది. చాలామంది శ్రీ విద్య,
గురువుల ఉపదేశములేకుండా, గురువులు సమక్షములో లేకుండా ఉపాసిస్తూ అనేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆదిశంకరుల హెచ్చరికను పెడచెవిని పెట్టి అనేక మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.