13 November, 2012

దీపావళి ముచ్చట్లు -1

దీపావళి ముచ్చట్లు -1




ప్రతి దీపావళీ అందరికీ కొత్తగానే వుంటుంది. ఎన్ని దీపావళీలు గడిచినా, దీపావళి వస్తోందంటే, అదొక కొత్త ఉత్సాహం.

చిన్నప్పుడు మా ఇంట్లో మగపిల్లలం ఆరు, ఆడపిల్లలు ఐదు కాబట్టి, దీపావళి అంతా మా ఇంట్లోనే జరిగేది. నెల రోజులబట్టీ, మతాబాల గొట్టాలు మా శ్రీ భాస్కరన్నయ్య తయారు చేస్తూ ఉండేవాడు. మొత్తం పదకొండు మంది. దీపావళి ముందు నుంచి అమ్మ కార్తీక సోమవారాలు, పౌర్ణమి దాక ఉండాలి కాబట్టి, మతాబా గొట్టాలు ఓ రెండు వందలు తయారు చేశేవాడు. అవ్వన్నీ తయారు చేయటానికి, శ్రీ వేదాద్రి చిన్నన్నయ్య, నేను, భాస్కరన్నయ్యకు సహాయం చేశేవాళ్ళం. మతాబా గొట్టాలకి పేపర్లు, చుట్టటానికి కావలసిన గుండ్రటి వెదురు పుల్లలు అన్నీ సిద్ధము చేసుకుని కార్య రంగంలోకి ఉరికేవాడు శ్రీ భాస్కరన్నయ్య.

ఆ మతాబా గొట్టాలు తయారుచేయటానికి కావలసిన మైదా పిండి మా దుర్గక్కయ్య, పొట్టుపొయ్యమీద తయారు చేసి ఇస్తూండేది. అప్పటికింకా మా ఇంట్లో గ్యాస్ పొయ్యిలు రాలేదు. ఇవి 1958-59 ప్రాంతములో మేము విజయవాడ గవర్నరు పేటలో ఉండేటప్పటి ముచ్చట్లు.

మేము మతాబా గొలు రెండువందలు తయారు చేసి, అవి పెద్ద ఈత ఆకు చాపల మీద పెట్టి ఎండలో పెట్తే, అవి వంకర పోతుంటే, మా అన్నయ్య వచ్చి, వాటిని కాస్త నీడలోకి చాపతో సహా లాగుతుండేవాడు. అవి అలా రెండురోజులు ఎండబెట్టి, వాటిని, తీసుకెళ్ళి పందిరిమంచం క్రిందకి ఎవరూ తొక్కకుండా ఉండేందుకు, తోసేసేవాడు. ఇంక పెద్దన్నయ్యతో, మతాబాలకి కావలసిన ముడి సరుకులు కొనుక్కుని రావడం ఓ సరదాగా ఉండేది. ఇనుపరజను, గంధకము, సురేకారము, పొడిసున్నము, ఆముదము, ఇవి కావలసినవి. అవి గవర్నరుపేట "చెట్లబజారులో" దొరికేవి. అక్కడ దాదాపు నాలుగు వీశెలు (పాత తులామానము, వీశె అంటే పద్నాలుగు వందల గ్రాంలు) కొనుక్కుని,తిరిగి వచ్చేటప్పుడు, అరండల్ సత్రము దగ్గర ఖాళీ మట్టి చిచ్చు బుడ్లు ఓ రెండు డజన్లు, ప్రమిదలు ఓ వంద అన్నయ్య కొనేవాడు. ఇవ్వన్నీ కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఓ రెండు గంటలు పట్టేది. అంటే పొద్దున్న ఎనిమిదికి వెళ్తే, ఇంటికివచ్చేసరికి, పదయ్యేది.

ఇఖ అన్నయ్య ఆ మందు సామన్లన్ని, మా ఇంట్లో చివర గదిలోకి చేర్చి, మేమవరము రాకుండా, ఆ రజను, గంధకము, నూరినసురేకారము, సున్నము, అన్నీ చెత్తాచెదారము లేకుండా తనొక్కడే శుభ్రము చేశేవాడు. మేము లోపలకి వెళ్ళకుండా, కిటికీలోనుండి, అన్నీ విచిత్రముగా చూశేవాళ్ళము. ఆ పని అయిన తరువాత అవ్వన్నీ ఎండబెట్టేవాడు. చిచ్చుబుడ్ల మూతులు (చిన్నకంతలకు) చిన్న కాగితాలతో, మూసేసేవాడు. అన్నీ ఓ రెండు మూడురోజులు ఎండబెట్టి, మాఇంట్లో పెద్ద పులిహార పళ్ళములో , ఓ రాత్రి పూట అన్నీ కలిపి మతాబాల మందు తయారు చేశేవాడు. మా అమ్మ చేత "శాంపిల్" మతాబా కాల్పించేవాడు. అది బాగా పువ్వులు పడుతూ ఆగకుండా కాలితే, అన్ని మతాబాలు తయారు చేసేవాడు. ఈ మతాబాలు కూరటంలో ఇంట్లో మగపిల్లలము అందరము సహాయము చేసేవారము. మతాబు గట్టిగా రావాలని అన్నయ్య మధ్య మధ్య హెచ్చరిస్తూ ఉండేవాడు. మతాబా చివర కాస్త "ఇసక" పోసి తయారు చెయ్యమని అమ్మ చెపుతూ ఉండెది. చిన్నపిల్లలు చేతులు కాల్చుకుంటారని అమ్మ హెచ్చరిస్తు ఉండేది. చిచ్చుబుడ్లు మాత్రము అన్నయ్యే అన్నీ చేస్తూండేవాడు. మొదట ప్రత్యేకముగా తను బజారు నుండి తెచ్చిన "జిల్లీ" అనే మందు పోసి, దానిమీద మతాబు మందు జాగ్రత్తగా ఎక్కువ వత్తిడి లేకుండా కూరి వెనకాల మళ్ళీ కాగితాలు అన్నీ కూరి, బంకమట్టితో మూసేశేవాడు. చిచ్చుబుడ్లుకూడా "శ్యాంపిల్స్" అంటూ అన్నయ్యే ముట్టించేవాడు. అది పగలే అయినా అది పువ్వులు పైకి విరజిమ్ముతూంటే, ఆనందంతో గంతులేసేవాళ్ళం. పైగా అది మా అన్నయ్య సొంత తయారీ కదా! అదీ గర్వం.

అన్నయ్యకి ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళటం వలన ఓ ఆరేడు సంవత్సరాల తరువాత ఈ పని అంతా నేనే చూశేవాడిని. అయితే ఇంత భారీగా ఉండేది కాదు. ఎందుకంటే, ఇద్దరు అక్కయ్యలు అత్తవారిళ్ళకు, వెళ్ళారు. ఓ అన్నయ్య ఉద్యోగం, ఇంకో అన్నయ్య పెద్ద చదువు, దీపావళీ ఖర్చు , ఇవ్వన్నీ కలిపి నా పని భారం తగ్గించేశాయి. ఐనా ఉత్సాహం తగ్గక, అలాగే చేస్తూండేవాళ్ళము, నేను, మాసారధి తమ్ముడు, మూర్తి తమ్ముడు. ఓ సారి మా ఇంట్లో దీపావళీ సీజనులో ఓ పెద్ద అగ్నిపమాదం జరిగింది. ఆ విశేషాలు చెప్పబోయేముందు, ఓ చిన్న డిన్నర్ బ్రేక్.

No comments:

కీసర వంశము***** KEESARAVAMSAM