కళాఖండాలైన చిత్రాలలో వినోదం మరియు సాంకేతిక విలువలతో పాటు మానవజాతికి మంచి సందేశం కూడా ఉండేది. అటువంటి చిత్రాలలో మాయా బజార్ ఒకటి. 1957లో విడుదలైన ఈ చిత్ర కథాంశం పూర్తిగా కల్పితేమే అయినా ఆద్యంతం మనలను మంత్రముగ్ధులను చేయటానికి కారణం చిత్రీకరణ, నటన, సంగీతంలతో పాటు కథలోని సందేశం కూడా. శశిరేఖను అభిమన్యుడు పెళ్లాడటానికి ఘటోత్కచుడు చేసే మాయాజాలం పూర్తిగా కలిపితమే. మహాభారతంలో ఈ ఘట్టం లేదు. అయినా, ఈ చిత్రం చూస్తే ఏ మాత్రం కల్పితం అన్న భావన రాదు. అందుకు కారణం ప్రతి
సన్నివేశం కూడా మనలను హత్తుకునేలా సంభాషణలు, సెట్టింగ్స్ మరియు వేషభూషలతో చిత్రీకరించటం వలన.
ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఘటోత్కచుడు ద్వారకలో ఉన్న శశిరేఖను అపహరించి తన రాజ్యానికి తీసుకువెళ్లటం, తదుపరి తాను ఆ శశిరేఖగా నటించటం. ఘటోత్కచుడు ద్వారక ప్రవేశించే సమయంలో అతనిలో తాను ఏదైనా సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం కాస్త మితిమీరుతుంది. అతని ఉత్సాహాన్ని అదుపులో ఉంచటానికి కృష్ణ పరమాత్మ ముసలి తాత రూపంలో కూర్చొని అతనిని పరీక్షిస్తాడు. కార్య సాధనలో నేను చేయగలను అన్న ఆత్మ విశ్వాసంతో పాటు, అది పరమాత్మ అనుగ్రహంతో చేస్తున్నాను అన్న కృతజ్ఞత, జ్ఞానం ఉంటే పరమాత్మ ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎప్పుడైతే నా వల్లనే జరుగుతుంది, నేనే దీనికి కర్తను అన్న భావన మనసులో ప్రవేశిస్తుందో అప్పుడు భంగపాటు తప్పదు. ఆ తత్త్వాన్ని విశదంగా తెలియజేటానికే ఈ సన్నివేశాన్ని సృష్టించారు దర్శకులు కేవీ రెడ్డి గారు. పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి. వివరాలు:
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు ఉన్నది ఇటు లేదు ఇటు ఉన్నది అటు లేదు
అటు నేనే ఇటు నేనే అటు నేనే ఇటు నేనే
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
చిన చేపను పెద చేప చినమాయను పెనుమాయ
అది స్వాహా ఇది స్వాహా అది స్వాహా ఇది స్వాహా
చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
ఎరుకకుండ వచ్చావు ఎరుకలేక పోతావు
ఇది వేదం ఇదె వేదం ఇదె వేదం ఇదె వేదం
ఘటోత్కచుడు: "ఏయ్ తాతా? నీ వేదం బాగానే ఉంది కానీ, అసలు నువ్వెవరివో చెప్పు"
తాత: "ఓహోహోహోహో నీవా? నీకు తెలియదూ నేనెవరినో?"
ఘటోత్కచుడు:"తెలియకనేగా అడిగేది"
తాత: "తెలియని వానికి చెప్పినా తెలియదు"
ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! నీ కుతర్కం చాలించు. నువ్వెవరివైతే నాకేమిలే! చూడు...శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు"
తాత:"హాయ్ హాయ్ నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావ్? పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చెబుతాను."
ఘటోత్కచుడు:"ఏయ్ తాతా! ఏమనుకున్నావ్? జాగ్రత్త. నాకాగ్రహమొస్తే ఆగను. నిన్ను నీ ద్వారకను సముద్రంలో ముంచి పోతాను."
తాత:"అబ్బో అబ్బో అంత ఘనుడివా? చెప్పవేం మరి? అయితే, నువ్వు అంత పని చేయనక్కరలే. నేను ముసలి వాడిని. నడవలేను. నన్ను మోసుకొని పో. అలాగే శశిరేఖను చూపిస్తా."
ఘటోత్కచుడు: "ఉం. అలా రా దారికి. హ హ లే."
తాత:"చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"
ఘటోత్కచుడు:"అరే! ఇంత బరువున్నావే!"
తాత:"ద్వారకనే పెళ్లగిస్తానంటివే? మరి నన్నే ఎత్తలేవా?"
తాత:"హు హు హు హు హు హు ఎత్తు నాయనా ఎత్తు.."
ఘటోత్కచుడు:"ఊ.. ఏనుగులు మింగావా పర్వతాలు ఫలహారం చేశావా ఏమిటి నీ మాయ?"
తాత:"చిన మాయను పెను మాయ అది స్వాహా ఇది స్వాహా అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే"
ఘటోత్కచుడు:"ఓహోహోహోహో తెలిసింది తెలిసింది..నమో నమో నమో నమో నమో నమః నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః"
కృష్ణుడు: "చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ"
ఈ సంభాషణలను నిశితంగా పరిశీలిద్దాం.
ఆశీర్వచనంతో ప్రారంభించిన కృష్ణ పరమాత్మ మాయ, పరమాత్మ తత్వాలను నేరుగా ఆవిష్కరిస్తాడు. మాయ తన సృష్టే అని, కనిపించేది, కనిపించనిది, మన దగ్గర ఉన్నది దూరాన ఉన్నదీ అన్నీ తానే, అన్నీ తన లీలలే అని ఆయన చెబుతాడు. చిన్న మాయను పెద్ద మాయ చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు మింగేస్తూ ఈ ప్రపంచమంతా మాయలో నడుస్తుందని ఆయన సనాతన ధర్మ ఆధ్యాత్మిక సారాన్ని అందించాడు. మాయలో నేను, నా వలన అన్న భావనలో, తాడును చూసి పాము అనుకునే భ్రాంతిలో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇదంతా లీలగా ఆయన చూస్తుంటాడు. తెలియకుండానే పుడతాము. తెలియకుండానే పోతాము. అంటే ఈ శరీరానికి సంబంధించిన జనన మరణాలతో మేధకు సంబంధం లేకుండా కాలచక్రం సాగిపోతుంది. అందులో అన్నిటికీ అతీతంగా ఉండేది పరమాత్మ ఒక్కటే. అతీతమైన ఆయన అన్నిటికీ సృష్టికర్తగా చెప్పబడ్డాడు.
మరి ఎదురుగా పరమాత్మ నిలబడితే ఆయనను గుర్తించకుండా చేసేది? మన అహంకారం. ఈ దేహానికి సంబంధించిన వాసనలు. వీరోత్సాహంతో ద్వారక చేరిన ఘటోత్కచుడు తాత రూపంలో ఉన్న కృష్ణుని ఎన్ని సంకేతాలు వచ్చినా గుర్తించలేకపోతాడు. మనం కూడా అంతే. సృష్టిలోని జీవరాశులన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడని తెలియకు కొన్ని సార్లు, తెలిసినా కూడా మాయలో పడి అహంకారపూరితమైన వివక్షను చూపిస్తాము.
ఈ సంభాషణలో "తెలియని వానికి చెప్పినా తెలియదు" అని అంటాడు శ్రీకృష్ణుడు. తెలుసుకుందాము అని కోరుకునే వానికి ఫలితం రావాలంటే ముఖ్యం సంకల్పం, చిత్తశుద్ధి. మరి అహంకారముంటే ఆ రెండూ మలినమవుతాయి. అప్పుడు ఇతరులు చెప్పినా తెలుసుకోలేరు. హిరణ్యాక్షుడు, రావణుడు, దుర్యోధనుడు మొదలైన వారికి ఎంతో మంది హితవు పలికినా వారు వినాశనము వైపే అడుగులు వేశారు. కారణం మాయకు లోబడి పరమాత్మ తత్త్వాన్ని ఎరుగక పోవటం, తాము ప్రపంచాన్ని జయించామన్న అహంకారం.
ఘటోత్కచుడు ముసలివాడన్న చులకనతో ఆతనిని సాయం అడగటంలో కొంత అహంకారం ప్రదర్శిస్తాడు. దానికి సమాధానంగా పరమాత్మ - సాయం కోరి వచ్చినవాడివి అదిరిస్తున్నావు. నీ ఉనికి తెలిపి శరణు కోరు, తప్పక సాయం చేస్తాను అంటాడు. పరమాత్మకు కావలసినది శరణాగతి. అది ఉంటే సంకల్ప మాత్రాన మన కామ్యములు నెరవేరతాయి అన్నది ఈ సంభాషణలోని సందేశం. తరువాత, కార్యసాధనలో చులకన భావాన్ని ప్రదర్శించిన ఘటోత్కచుడికి భంగపాటు తప్పలేదు. ముసలివాడిని ఎత్తటం ఎంత అనుకున్నాడు. కానీ, అహంకారంతో వస్తే విశ్వమంతా ఉన్నవాడిని ఎలా ఎత్తగలడు? తన శక్తితో ద్వారకనే పెళ్లగిస్తానన్నవాడు ముసలివాడిని ఎత్తలేకపోతాడు. అనగా, తన శక్తికి కారణం దైవం అన్న సంగతి స్వాతిశయముతో కప్పబడుతుంది. దానికి కనువిప్పు కలిగిస్తాడు పరమాత్మ. కార్యసాధనలో భగవంతునిపై దృష్టి నిరంతరం ఉండాలి అన్న సత్యాన్ని మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దైవలీలతో కనువిప్పు కలిగి ఘటోత్కచుడు శ్రీకృష్ణుని శరణు వేడుతాడు. విజయాన్ని పొందుతాడు.
ఈ తత్వానికి మనకు అత్యంత ఉత్తమమైన ఉదాహరణ శ్రీమద్రామాయణంలో హనుమంతుడు. ఎంతటి బలసంపన్నుడైనా హనుమంతుడు స్వామి నామాన్ని మరువలేదు. తన బలిమి, కలిమి స్వామే అని నమ్మాడు. క్లైబ్యం వచ్చినా తనలను తాను మళ్లీ స్వామి నామస్మరణతో శక్తివంతం చేసుకున్నాడు. కార్యాన్ని సాధించాడు.
ఇటువంటి సందేశాత్మక సన్నివేశాలు మాయాబజార్ సినిమాలో మరెన్నో. అందుకే దాదాపు 67 ఏళ్లు అయినా ఈ చిత్రం ఇప్పటికీ నేటి సమాజంలో బహుళ ప్రజాదరణ కలిగి ఉంది. ఎన్ని మార్లు చూసినా మళ్లీ చూడాలన్న ఉత్సుకత కలుగుతుంది.