31 March, 2012

శ్రీరామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు




రేపు మనం "శ్రీరామనవమి" పర్వదినమును జరుపుకోబోతున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని "శివ ధనుర్భంగము" గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.



"శ్రీమద్రామాయణము" ఆబాలగోపాలానికి ఆదరపాత్రమైన ఆదికావ్యము. అందులోనూ మన తెలుగువారికి సీతారాములు ఆరాధ్యదైవాలు. తెలుగునాడులో శ్రీరాముని గుడి లేని గ్రామం లేదు. తెలుగువాడు "శ్రీరామ" చుట్టకుండా ఏ వ్రాతా ప్రారంభించడు. మన గోదావరీతీరం సీతారాముల పవిత్ర పాదపరాగములతో పులకించిపోయింది. అందువల్లనే, రామకథ అంటే తెలుగువారికి అంతులేని అభిమానం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు, మరే ఇతరభాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు.



"శ్రీరామనవమి"కి తెలుగునాట వాడవాడలా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి, వారి వివాహం ఏవిధంగా సంభవించింది? స్వయంవర నియమం ప్రకారం రఘువీరుడు శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచినందువల్లకదా!-------- ఈ శివధనుర్భంగ సన్నివేశాన్ని వివిధ కవులు తమతమ కావ్యాల్లో అద్భుతంగా వర్ణించారు. ఆ ఘట్టాన్ని కొంతమంది కవీశ్వరులు ఏవిధంగా మన ఎదుట రూపుకట్టించారో స్థూలంగా చెప్పడమే ఈనాటి ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము.



కవులలో ఎవరి శైలీవిన్యాసం వారికి ఉంటుంది.... ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ "రామాయణ కల్పవృక్షము"లో ఈ సన్నివేశాన్ని ఎలా వర్ణించారో తెలుసుకుందాము. వారు ఈ సందర్భంగా ఆణిముత్యాల వంటి 2 పద్యములను మనకు అందించారు.



అందులో మొదటి పద్యమును చిత్తగించండి.



నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత

స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం

హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా

ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్





ఆలంకారికులు కవిత్వమును స్థాయీభేదములను బట్టి 3 విధములుగా వర్గీకరించినారు. ఆ త్రివిధములైన ద్రాక్షాపాక, కదళీపాక, నారికేళపాకములలో నారికేళపాకము కఠినంగా ఉంటుందని, సులభంగా అర్థంకాదనీ అంటారు. ఐతే, చాలామంది విశ్వనాథవారి శైలిని పాషాణపాకమనీ, అది నారికేళపాకము కన్నా ప్రౌఢంగా ఉంటుందనీ చెప్తారు. విశ్వనాథవారు అలతి అలతియైన తేలికపదములతో వ్రాసిన పద్యములు లేకపోలేదు; అవి చాలా తక్కువ!



"రామాయణ కల్పవృక్షము" లోని పద్యములన్నింటిలోకి పై పద్యమే మిక్కిలి కఠినమైనదని చెప్పవచ్చును. ఐతే, అంత కఠినంగా ఉండుటయే ఈ పద్యము యొక్క సార్థక్యము, సౌందర్యము!



శ్రీరామచంద్రుడు శివధనుర్భంగము చేసినపుడు, ఆ ఛిన్న చాపము నుండి వెడలిన పరమదీర్ఘమైన, పరమకఠోరమైన ధ్వనిని స్ఫురింపజేయుట ఈ పద్యము యొక్క ప్రయోజనము. "ద్రాఘిష్ఠమ్మై ఒక రావము అంతట నెసంగెన్" అన్నారు. "రావము" అంటే శబ్దము; "ద్రాఘిష్ఠము" అనగా దీర్ఘతమము. పద్య ప్రారంభము నుండి 3 పాదములదాకా విస్తరించి సాగిన సంస్కృతసమాసము ఆ వింటిధ్వని యొక్క దీర్ఘత్వమును అమోఘంగా సూచిస్తున్నది.



ఇప్పుడు పద్యభావమును పరికిద్దాము.



"ఎడతెగకుండ వర్షించుచున్న అమోఘమైన మేఘముల సమూహము నుండి మిక్కిలిగా వచ్చు మెరుపుతీగలతో పాటు విజృంభించు పిడుగుల సమూహముల యొక్క ఘుర్ఘురధ్వనిని తక్కువ చేయునట్లుగా మిక్కిలి దీర్ఘమైన ఒక రావము ధనుస్సు నుండి వెలువడెను" అనేది ఈ పద్య తాత్పర్యము.



పద్యభావమును అవగతం చేసుకోలేకపోయినా, కేవలం పద్యమును చదివినంతమాత్రము చేతనే ఆ భీకరధ్వనిని ఊహించగలుగుతారు చదువరులు! అదే కవీశ్వరుల ప్రతిభ! ఈ పద్యములో విశ్వనాథవారు షకారముతో కూడిన ఠకారముతో దుష్కరమైన ప్రాసను వేసినారు. ద్వితీయ పాదారంభములో "స్పేష్ఠే" అనే పదము ధనుర్భంగ సందర్భములోని విస్ఫోటమును అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. మరి, ఇంతటి భయంకరమైన రావమును వర్ణించడానికి తేలికపదములను వినియోగిస్తే, మీసములు లేకుండా భీమసేనుని వేషము వేసినట్లుగా ఉంటుంది!...... అందుకే విశ్వనాథవారు అంత కఠినమైన సుదీర్ఘ సమాస ప్రయోగం చేశారు.



ఇక, 2వ పద్యములో ఆ భీకరధ్వని యొక్క కాఠిన్యము ఎటువంటిదో వివరిస్తున్నారు.



హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై, షణ్ముఖ

స్ఫార ద్వాదశనేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక

న్యారాజన్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై, ఆశ్చల

ద్గీరుగ్ర ప్రమథంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్

ఆ వింటిధ్వని వినాయకుని చేటలవంటి చెవితొఱ్ఱలకు సిగ్గును కలిగించినదట! గణేశుడు గజముఖుడు కదా! అందుకే ఆయనవి శూర్పకర్ణములు, అనగా చేటలవంటి విశాలమైన వీనులు! అటువంటి విశాల కర్ణములకే ఆ నాదము శ్రవణభీకరంగా ఉన్నదంటే, ఇక మామూలు మానవులకు ఎలా ఉండివుంటుంది!!.... ఇంకా ఏమంటున్నారో చూడండి. షణ్ముఖుడైన కుమారస్వామి విస్మయముతో తన 12 నేత్రములను విప్పార్చి చూచునట్లుగా చేసినదట ఆ రావము! కుమారస్వామి 6 శిరస్సులను కలిగినవాడు, అనగా 12 నయనములు! ఇకపోతే, గిరిరాజసుతయైన పార్వతీదేవి సైతం ఆ భయంకర నాదాన్ని విని, అప్రయత్నంగానే తన భ్రుకుటిని ముడివేసినదట! ఆమె అందమైన లలాటఫలకం ఆశ్చర్యముతో ముడివడిపోయినదట! ఇక, శివపార్వతులను సేవించే ప్రమథగణాలన్నీ ఆ భీకర విస్ఫోటన ధ్వనిని విని భయముతో "ఆఃప్రకట" రావము చేస్తూ అచేతనులు అయినారట!.... ఈవిధంగా "ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్".



శివధనుర్భంగము యొక్క పరిణామము కైలాసములో, కైలాసవాసులలో ఏ రకంగా ప్రతిఫలించినదో విశ్వనాథవారు ఈ పద్యములో ఎంతో హృద్యంగా వర్ణించారు. అది శివుని ధనుస్సు కాబట్టి, శివలోకమైన కైలాసములో కలిగిన అల్లకల్లోలమును వారు మన కళ్ళకు కట్టారు.



"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు మధురకవిగా ప్రసిద్ధులు. ఎంతటి గంభీర విషయమునైనా అలవోకగా మృదుమధురమైన ఫణితిలో చెప్పగలగడం వారి ప్రత్యేకత!... మరి, శివధనుర్భంగాన్ని వారి మాటలలో విందాము.



ఫెళ్ళుమనె విల్లు! గంటలు ఘల్లుమనే!

గుభిల్లుమనె గుండె నృపులకు!

ఝల్లుమనియె జానకీ దేహము!

ఒక నిమేషంబునందె నయము, జయము, భయము, విస్మయము గదుర!



శ్రీరాముడు ఎక్కుపెట్టగానే శివధనుస్సు ఫెళ్ళుమని విరిగినది. ఆ వింటికి కట్టివున్న చిరుగంటలు ఘల్లుమని మ్రోగినవి. సభలో ఆసీనులైవున్న రాజకుమారులందరి గుండెలు ఆ భీకరనాదానికి గుభిల్లుమన్నాయి. ఇక, సీతాదేవి శరీరము ఝల్లుమని పులకరించిపోయింది..... ఎంత అందమైన, మనోహరమైన వర్ణన! ఈ చిన్నిపద్యములోనే అక్కడి వాతావరణాన్ని మనోజ్ఞంగా మన కనుల ముందర నిలిపినారు పాపయ్యశాస్త్రిగారు!.... ఒక్క నిమిషములోనే నయము, జయము, భయము, విస్మయము ప్రతిఫలించినాయట ఆ సభాస్థలిలో! విల్లు ఫెళ్ళుమనడానికి నయము, గంటలు ఘల్లుమనడానికి జయము, నరపతుల గుండెలు గుభిల్లుమనడానికి భయము, వైదేహి దేహము ఝల్లుమనడానికి విస్మయము ప్రతీకలు! ముందు 4 విషయములను చెప్పి, చివరి పాదములో నయము, జయము, భయము, విస్మయములను ఉటంకించి ఈ చిన్నిపద్యమును క్రమాలంకారములో తీర్చిదిద్దినారు కరుణశ్రీ!



ఇక, చివరగా మన సమకాలికుడైన ఒక ఆధునిక కవి గురించి తెలుసుకుందాము. ప్రముఖ సినీనిర్మాత ఎం.ఎస్.రెడ్డిగారు మంచి సాహితీపరులు. వారు తాము నిర్మించిన చిత్రాలలో పాటలు కూడా వ్రాస్తుంటారు. ఆయన గీతాలు చక్కని పదముల పొందికతో శ్రవణసుభగంగా ఉంటాయి. ఆయనను "సహజకవి, మల్లెమాల" అని పిలుస్తారు. బహుశా "మల్లెమాల" అనేది వారి ఇంటిపేరు కాబోలు! వారు రచించిన "మల్లెమాల రామాయణము" కొన్నాళ్ళ క్రితం టివి లో ఉదయంవేళల్లో ధారావాహికగా ప్రసారమయింది. ఆయన తన కావ్యములోని పద్యాలను చదువుతూవుంటే, మరొక సాహితీవేత్త దానికి వ్యాఖ్యానం చెప్పేవారు.



మరి, మల్లెమాలగారి "శివధనుర్భంగము" ఎలావుందో చూద్దాము.



ఫెళఫెళార్భటు లెనయంగ విరిగె ధనువు

భళిభళీ యని శుభమస్తు పలికె గురువు

ప్రీతిమెయి పులకించె భూమాత తనువు

తెలియకనె సీత మోమున మొలిచె నగవు

పద్యము చాలా సులభగ్రాహ్యంగా ఉంది; విడమరచి చెప్పవలసిన పని లేదు. 3వ పాదములో "పులకించె భూమాత తనువు" అన్నారు. సీత భూజాత కదా! తన కుమార్తెకు వివాహం జరగబోతుంటే ఏ తల్లి తనువు మాత్రం పులకించదు?!....... ఇక్కడ మరో అర్థం సైతం చెప్పుకోవచ్చు. జనులందరూ భూమాత ఒడిలోనే కదా ఉండేది! ఆమె తనువు పులకించినదని అంటే, పృథ్విపైనున్న సకల జీవుల తనువులు పులకించాయన్నట్లే!



"శివ ధనుర్భంగము" ఘట్టమును వివిధ కవులు ఎలా వర్ణించారో, నాకు తెలిసినంతలో వివరించే ప్రయత్నం చేశాను.







23 March, 2012

శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు

శ్రీరామ


శ్రీ నందన నామ నూతన సంవత్సర - ఉగాది శుభాకాంక్షలు


శాస్త్రాణ్యధీత్యా2పి భవన్తి మూర్ఖాః
యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్
సుచిన్తితం చౌషధ మాతురాణాం
న నామమాత్రేణ కరోత్యరోగమ్


(హితోపదేశమ్- మిత్రలాభం-167)

విషయ సేకరణ,పరిజ్ఞానము (Scientific / General Knowledge) కలవారు విద్వాంసులు (వివేకులు) కారు. ఎవరైతే జ్ఞానాన్ని ఆచరణలో పెడతారో వారే వివేకులు. తన రోగ లక్షణాలకు సరిపడే మందు పేరు తెలుసుకున్నంత మాత్రమునగాని, సేకరించి పెట్టుకున్నంతమాత్రమున గాని రోగనివృత్తి కలుగదు గదా ! ఆ మందును విధివిధానముగ అనుపానములతోను, పథ్యమైన ఆహార-విహారాదులతోను నిర్ణీతకాల పరిమితి వరకు సేవిస్తేనే కదా ఆరోగ్యలాభం కలిగేది !

కాబట్టి మనం News Papers చదివినా, T.V.Programmes,News చూసినా, మన దేశము, భారతజాతి ప్రతిష్ఠలను గూర్చి, విలువల పతనం గూర్చి, మనలో కలిగే స్పందనలను కేవలం "వారు అట్లా; వీరు ఇట్లా !" అనుకుంటూ కూర్చునేకన్నా, "పరిస్థితిని బాగుచేసే యజ్ఞంలో నేనుకూడ ఏదోఒక్క సమిధనైనా వేయటానికి ప్రయత్నిస్తా" నని ఈ నూతన సంవత్సర నిర్ణయంగా భావించుదాం !


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన సంవత్సరంలో

సకల సన్మంగళములను అనుగ్రహించమని

ఆ పరాత్పరుని వేడుకుంటున్నాము !

18 March, 2012

FROM OUR OLD ALBUM - YOUR MODERATOR AND HIS WIFE

This is a photograph of your moderator Mr.K.S.S.N.SARMA AND HIS WIFE JAGADEESWARI

      This photographs is taken on the occasion of their first marriage anniversary.

              

07 March, 2012

చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.

                                    చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం ఆవిష్కరణ.




తమ్ముడు చి.పార్ధసారధిశర్మ భగవాన్ సత్యసాయి వచన శతకం గుంటూరు మారుతీనగర్ లోని

మారుతీదేవాలయములో ఆవిష్కరణ 5.03.2012 న జరిగినది. ఈకార్యక్రమమునకు సంబంధించి

వార్తలు ఈనాడు దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలలో ప్రచురించారు. ఈనాడు వార్త చిత్రకధనం ఇక్కడ

చూడవచ్చును. యశస్వీభవ.
 
 

03 March, 2012

శ్రీ మద్భగవద్గీత

సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన చరిత్ర ఇది. ధృతరాష్ర్టుడు, పాండురాజు అన్నదమ్ములు. పాండురాజుకి 5గురు సంతానం. యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని క్రమంగ వారి పేర్లు. ధర్మరాజు సహజంగ మంచి గుణాలు కలిగిన ధర్మమూర్తి. ఆతని సోదరులు వినయవిధేయతలు కలిగి అన్నగారి మాటను జవదాటని బుద్ధిమంతులు. చిన్నప్పుడే వీరు తండ్రిని కోల్పోయారు. ద్రౌపది వీరి భార్య. ఈమె మహాపతివ్రతయే కాక గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు కూడ. ధృతరాష్ర్టడు పుట్టుగ్రుడ్డి. ఇతనికి 100 మంది సంతానం. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికీ, వంచనకీ ఇతడు మారుపేరుగ ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ర్టుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగ ప్రకటించుకొని, తన తండ్రి తరపున హస్తినాపురాన్ని పాలిస్తూ ఉండేవాడు. పాండవులకి పెరిగి పెద్దయ్యాక రాజ్యంలో కొంతభాగం రావాలి కద! కానీ, దుర్యోధనుడి మోసపుటెత్తుల వల్ల రాజ్యం రాలేదు సరిగద, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఒక ఏడాది విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం కూడ చేయవలసి వచ్చింది. ఇలా 13 సంవత్సరాలు రాజ్యభ్రష్ఠులై తిరిగిన పాండవులు గడువుతీరి, తిరిగివచ్చారు. తమకు ధర్మబద్ధంగ రావలసిన రాజ్యభాగము తమకిమ్మని కబురుపంపారు కౌరవులకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు, పాండవులకి రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధము చేయవలసి వచ్చింది పాండవులకి. ఈ ద్వాపరయుగం చివరలో జరిగిన యుద్ధానికీ “మహాభారతయుద్ధ”మనే పేరు ప్రసిద్ధమైంది.




18 దినాలు జరిగిన ఈ మహాయుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నదట. అందులో 11 అక్షౌహిణీల సైన్యం కౌరవుల పక్షాన పాల్గొన్నదట. 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే పాండవుల పక్షాన చేరింది. ఆశ్చర్యమేమంటే, శ్రీకృష్ణభగవానుడు కూడా పాండవుల పక్షాన అర్జున సారథిగ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఒక అక్షౌహిణీ అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్వములు, 1,09,350 పదాతిదళము. రథంలో కనీసం ఇద్దరుంటారు. ఏనుగు పై ఇద్దరుంటారు. అశ్వం పై ఒక వీరుడుంటాడు. అంటే ఒక అక్షౌహీణీలో జంతువులు కాక 1,53,090 మంది వీరులుంటారు. అలాంటివి 18 అక్షౌహణీలంటే 27,55,620 మంది మనుష్యులు + జంతువులు.



దీనిని బట్టి మహాభారత యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారో కదా! యుద్ధం పూర్తయ్యేనాటికి ఒక్కరూ మిగలనే లేదట. అంతా వీరమరణాన్నే పొందారు. భీష్మపితామహుడు కౌరవులకీ, పాండవులకీ తాతగారు. చిన్నప్పటి నుండి వివాహం చేసుకోలేదు. బ్రహ్మచర్య వ్రతంలోనే జీవించిన మహాశక్తివంతుడు. ఈయనే కౌరవసేనకు అధినేత. ద్రౌపదికి సోదరుడైన ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనకు అధిపతి. యుద్ధారంభానికి ముందే మహర్షి వేదవ్యాసభగవానుడు ధృతరాష్ర్టుడి దగ్గరకు వచ్చాడు. అతనికిష్టమైతే, జరిగే యుద్ధాన్ని ఇంట్లోంచే చూడగలిగే దివ్యదృష్టిని ఇస్తానన్నాడు. “దివ్యదృష్టి” అంటే ఎక్కడ జరిగే ఏ విషయాన్నైనా తలచినంతమాత్రానే ఉన్నచోటనే ఉండి దర్శింగలిగే శక్తి అన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు దానికి ఇష్టపడలేదు. తన మిత్రుడు, సారథి కూడా అయిన సంజయునికా శక్తినిమ్మన్నాడు. అవసరమైతే అతనిద్వారా వివరాలు తెలుసుకుంటానన్నాడు. వేదవ్యాసమహర్షి దివ్యదృష్టిని సంజయునికే ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు.



సంజయుడు పరమ శ్రీకృష్ణ భక్తుడే అయినా, తన యజమాని ధృతరాష్ర్టుడికి మాత్రం నమ్మినబంటు, సరే అనుకున్న ప్రకారం, మహాభారత యుద్ధం మార్గశిర మాసారంభానికి ఒక రోజు ముందు ప్రారంభమైంది. యుద్ధరంగంలో ఇరుపక్షాలు చేరి యుద్ధారంభాన్ని ప్రకటించాక అర్జునునికి హఠాత్తుగ మనసు మారిపోయింది. తన బంధువులని చంపడం తగదని, ఎంత చెడిన వారైనా యుద్ధమే వద్దనిపించింది. వారు తప్పే చేసినా, హింసించడం మంచిది కాదనిపించింది. యుద్ధం మానేసి అడుక్కొనితిని బ్రతికినా మేలేననుకొన్నాడు. “దోషి ఎవరైనా, చివరకు తన బంధువే అయినప్పటికీ, దండనార్హుడే” దండించే అధికారమున్న వ్యక్తి సమయమాసన్నమైతే, దోషిని తప్పకుండా దండించితీరడమే కర్తవ్యం. అప్పుడు బంధుత్వాన్ని, హింసనూ తలవతగదు. రోగిని శస్త్రచికిత్స ద్వారా బాగుచేయవలసిన వైద్యుడు, శరీరాన్ని కోయడం, కుట్టడం వంటి పనులు చేయక తప్పదు కదా! వాటిని హింస అనలేము గదా! అదే అవసరం కూడా. ధర్మయుద్ధంలో జరిపే హింస గూడా అలాంటిదే అనే విషయం అర్జునుడు గుర్తించలేదు. కింకర్తవ్యతామూఢుడైన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి అన్నట్లు, లోకులందరికీ, నిత్యజీవన సమయంలో ఏ పని చేయాలో, ఏది మానాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డప్పుడు కర్తవ్యబోధ చేసే అద్భుతమైన ఉపదేశంగ శ్రీ కృష్ణుడు అందించిన సందేశమే “భగవద్గీత”. విషాదంలో, పడి కర్తవ్యాన్ని గుర్తిచలేని మనిషికి, విశ్వసించి ఆశ్రయిస్తే, కర్తవ్యాన్ని ఆదేశించి దిశానిర్దేశం చేయగలిగిన, విజయపథంలో నడపగలిగిన ఉత్తమోత్తమమైన గ్రంథమే భగవద్గీత. యుద్ధ క్ష్రేత్రాన ఆవిర్భవించిన మహోపదేశమన్న మాట.



18 అధ్యాయాలుగా లభించిన ఈ మహోపదేశంలో 700 శ్లోకాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఏదో ఒక “...యోగః” అని పేరు. యోగమనే పదానికెన్నో అర్థాలున్నా, భగవద్గీతలోని అధ్యాయాల విషయానికి వస్తే ఉపాయము, సాధనము, మార్గము అనే అర్థాలు చెప్తారు ప్రామాణికులైన పెద్దలు. అంటే ప్రతీ అధ్యాయము గూడ ఆయా పేరు కల్గిన కర్తవ్యాన్ని తెలిపే ఒక్కొక్క సాధనమన్నమాట. శ్రీ కృష్ణుని ఉపదేశం విన్న అర్జునుడు తెలివి తెచ్చుకొని కర్తవ్యపాలనం చేసాడు. ఇక యుద్ధమారంభమైంది. సంజయుడికి దివ్యదృష్టిని యిప్పించినా, 10 దినాల దాక ధృతరాష్ర్టుడికి ఏమీ అడగాలని అనిపించలేదు. హఠాత్తుగా, 11వ దినాన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయాడనే సమాచారం చేరింది. దాంతో, కృంగిపోయిన ధృతరాష్ర్టుడు సంజయుణ్ణి పిలిచాడు. “అసలేం జరిగిందయ్యా. మా వాళ్ళకీ, పాండవులుకీ కూడా భీష్ముడంటే అపరిమితమైన గౌరవం ఉందిగద! మరి వీళ్ళందరూ ఉంటూండగ ఆయనెలా పడిపోయాడు... ఏం చేస్తున్నారు వీళ్ళంతా... “అని ప్రశ్నించాడు. దివ్యదృష్టితో చూచి జరిగినదంతా చెప్పాడు సంజయుడు. అందుకే ప్రశ్నలో యుద్ధరంగంలో పోరాడలనే చేరినవాళ్ళు ఎలా యుద్ధం చేసారయ్యా “...కథమకురుత?” అని అడగాలి కానీ “..కిమకుర్వత?” ఏమి చేసారయ్యా? అని అడగడం కుదరదు గద. అలానే యుద్ధారంభానికి ముందే, అంటే మార్గశిర మాసారంభంలోనే శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుణ్ణి యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అయినా, ఆ రోజున ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ దానిని వినలేదు. బహుశః వినగలిగే స్థితిలో ఉండి ఉండరు. ధృతరాష్ర్టుడి ప్రశ్నతో సంజయుడు 11వ దినాన దానిని ప్రకటించాకనే లోకానికి యుద్ధానికి ముందుగ ఆ ఉపదేశం జరిగిందన్న విషయం తెలిసింది. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని గీతాజయన్తిగ పాటిస్తారు. ఆనాడు, 700 శ్లోకాల భగవద్గీతను పూర్తిగ పఠించగలగడం అదృష్టం. లేదా, ఈ చరిత్రను తలచుకొని కొన్ని శ్లోకాలను చదువగలిగినా కొంత భాగ్యమే కద. ఇలా ధృతరాష్ర్టుడి ప్రశ్నతో భగవద్గీత లోకానికందిందనే కృతజ్ఞతతో, ఆయన ప్రశ్నతోనే గీతాపారాయణను ప్రారంభిస్తారు. రండి! మరి మనమూ ప్రారంభిద్దాం!



జైశ్రీమన్నారాయణ

కీసర వంశము***** KEESARAVAMSAM