04 January, 2013

ధనుర్మాసము -- మా దుర్గక్కయ్య - గొబ్బెమ్మలు




గొబ్బెమ్మలు - ధనుర్మాసము -- మా దుర్గక్కయ్య


మా ఇంట్లో ధనుర్మాసము ప్రారంభము రోజునుండి గొబ్బెమ్మలు పెట్టే ఆచారము ఉన్నది. మేము ఆరుగురు అన్నదమ్ములము, అయిదుగురు అక్కచెల్లెళ్ళు. ఆడపిల్లలలో పెద్దది హేమలత అక్కయ్య.


పెళ్ళయి అత్తవారింటికి నేను పుట్టకమునుపే వెళ్ళినందున, గొబ్బెమ్మెలు , మా రెండో అక్కయ్య "కనకదుర్గ" పెట్టటమే నాకు జ్ఞాపకం. ఆరోజుల్లో మేము విజయవాడ గవర్నరుపేటలోని రహమాన్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళము. మా ఇంటికి ఓ రెండువందల గజాల దూరములో "శ్రీగడ్డమణుగు రాఘవరావు" అనే మా నాన్నగారి తోటి వకీలు గారు ఉండేవారు. వారింట్లో ఆవులు చాలా ఉండేవి. వారికి ఇంటికి ఎదురుగా ఆవులకోసము వేరే "కొష్టము" ఉండేది. శ్రీ రాఘవరావుగారింటి దగ్గరున్న ఆ ఆవుల కొష్టము దగ్గరకు ఆ ప్రాంతము ఆడపిల్లలు అందరూ తెల్లవారు ఝాముననే "ఆవుపేడ" కోసము జట్లు జట్లుగా వచ్చేవారు. దాదాపు ఓ అరవై మంది పైగా వరుసగా నిలబడి శ్రీరాఘవారావుగారింట్లో ఆడవారు ఇచ్చే "ఆవుపేడ" ముద్దలను ఆనందంగా స్వీకరించేవారు. ( ఈ ఆనందంగా అనే మాట మా అక్కయ్య తరువాతి కాలములో చెపితే విన్నాను) నాకు అప్పుడు మహా ఉంటే ఓ ఆరు ఏళ్ళు ఉండవచ్చును. అక్కయ్య ఉదయాన్నే నన్ను మా అన్నయ్యను ( తనతరువాతి మగపిల్లాడు) లేపి వెంటబెట్టుకుని వెళ్ళేది. అలా అక్కయ్య వెంట "ఆవుపేడ" కోసము వెళ్ళటం మాకు ఎంతో సంతోషము, గర్వంగా ఉండేది. అక్కయ్య మమ్మల్ని తీసుకెళ్ళేది "ఆవుపేడ" ముద్దల్ని మోసుకురావటము కోసము. అందరు ఆడపిల్లలు "క్యూ"లో ఉంటే, తను ఆచివరనుండి, ఈచివరదాక తిరుగుతూ అందరితో కబుర్లు చెపుతూండేది. ఆవిడ బదులు మా అన్నయ్య "క్యూ"లో ఉండేవాడు.

నేను ఆవిడ వెంట తిరుగుతూ ఉండేవాడిని. ఆడపిల్లలు అందరూ "ఆవుపేడ" వాళ్ళే మోసుకొస్తూంటే, మా "దుర్గక్కయ్య" మాత్రం "మహారాణి" లా వాళ్ళ పక్కన ఠీవిగా నడుస్తూ వచ్చేది. వాళ్ళతో పాటే మా అక్కయ్య దగ్గరుండి మాచేతిలో పెట్టించిన "ఆవుపేడ" ముద్దలు మోసుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళము. "అదేమిటే దుర్గా! గోమయము నువ్వుతీసుకోకుండా, వాళ్ళచేతిలో పెట్టిస్తున్నావేమిటీ" అని వాళ్ళుప్రశ్నిస్తే, "గొబ్బెమ్మలకు పూజచేసి మేము పుణ్యం సంపాయించుకుంటున్నాము. మరి వాళ్ళకి ఎట్లా? అందుకని వాళ్ళని పొద్దునే లేపి ఇలా మోయిస్తున్నాను." అనేదిట. బహుశ: మాతల్లిదండ్రుల పుణ్యముతో పాటు, ఈ "ఆపుపేడ" మోసే పుణ్యము కూడా మా దుర్గక్కయ్య ద్వారా వచ్చుంటుంది. అందుకనే మేమంతా హాయిగా ఉన్నాము. ఇప్పుడు ఆవిడ లేదు. ఆవిడ స్మృతులు ప్రతి గొబ్బెమ్మలో కనపడతాయి. "ఇంద్రప్రస్తలో గుమ్మాలముందు ఆ కళ లేదు." బహుశ: హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ ప్రాంతాలలో కనబడుతుంది.

గొబ్బెమ్మల పాటలలొ ఆడపిల్లలు " సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే! తామరపూవంటి తమ్ముణ్ణివ్వావే! మొగలిపూవంటి మెగుణ్ణివ్వావే" అంటూ ప్రార్ధిస్తారు. ఈ సంప్రదాయ పద్దతులు తల్లిదండ్రులు పిల్లలకు మళ్ళీ నేర్పాలి.

కీసర వంశము***** KEESARAVAMSAM